ముంబయి: రైట్‌వింగ్ హిందూ సంస్థ సభ్యులు మహారాష్ట్రలోని హాజీ మలాంగ్ దర్గాలో కలకలం రేపారు. వార్షిక ఉర్సు పండుగ సందర్భంగా వీరంతా దర్గాలోకి దూసుకెళ్లి కాషాయ జెండాలు ఊపుతూ ‘జై శ్రీరామ్’, ‘ఏక్ హి నారా, ఏక్ హి నామ్, జై శ్రీ రామ్’ వంటి నినాదాలు చేస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
కాగా, హిందూ సంస్థ సభ్యలు దర్గాలో హంగామా చేస్తున్నప్పటికీ అక్కడే ఉన్న పోలీసు అధికారి మాత్రం జోక్యం చేసుకోకుండా ఉన్న దృశ్యం కూడా ఈ వీడియోలో కనిపించడం విమర్శలకు దారితీసింది. చాలా మంది హిందూ సంస్థ సభ్యులు మొత్తం సంఘటనను గర్వంగా రికార్డ్ చేస్తున్నట్లు కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు.
దీంతో థానే జిల్లాలో అన్ని మతాల ప్రజలు సందర్శించే మలంగ్ గడ్ కొండపై ఉన్న హాజీ మలంగ్ దర్గా మళ్ళీ వివాదాన్ని రేకెత్తించింది, హిందూ సంస్థలు దీనిని దేవాలయంగా పేర్కొంటే… ముస్లింలు దీనిని దర్గా అని పీర్ హజ్రత్ హాజీ అబ్దుల్ రెహమాన్ మందిరం అని పిలుస్తారు. ఇక ఆ దర్గా చుట్టూ అతని అనుచరుల ఐదు సమాధులు ఉన్నందున దీనిని పంచ్ పీర్ అని కూడా పిలుస్తారు.
సామాజిక కార్యకర్త ఇమ్రాన్ ఖాన్ ఈ సంఘటనను ఖండిస్తూ, “ఇది శాంతికి భంగం కలిగించే ప్రయత్నం. మతపరమైన ప్రదేశాలలో ఇటువంటి రెచ్చగొట్టే చర్యలను నిరోధించడానికి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి” అని అన్నారు. మరికొందరు వీడియో యొక్క మూలాలు మరియు సమయాన్ని నిర్ధారించడానికి సమగ్ర దర్యాప్తు చేయాలని పిలుపునిచ్చారు.
“ఈ ప్రదేశం ఎల్లప్పుడూ ఐక్యతకు చిహ్నంగా ఉంది. ఇటువంటి సంఘటనలు విభజనను మాత్రమే సృష్టిస్తాయి” అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని స్థానికుడు ఒకరు అన్నారు.
ఈ సంఘటనపై స్పందిస్తూ, దర్గా కమిటీ.. ఈ చర్యలను దారుణంగా అభివర్ణించింది. దర్గా కమిటీ సభ్యుడు ఒకరు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, “ఇటువంటి సంఘటనలను సహించలేము” అని అన్నారు. ఈ సంఘటనను నిర్లక్ష్యం చేస్తే సమాజంలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు ఎత్తి చూపడంతో అధికారుల స్పందన కోసం నెజిటన్లు ఎదురుచూస్తున్నారు.
మతపరమైన భావాలను గౌరవించేలా దర్గా పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకోవాలని చాలా మంది అధికారులను కోరుతున్నారు.