న్యూఢిల్లీ: భారత కొత్త ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ ఎంపికయ్యారు. కాగా , ఈ నియామకంపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం నేటితో ముగుస్తుండటంతో తదుపరి సీఈసీ ఎన్నికపై నిన్న ప్రధాని నివాసంలో ప్యానెల్ కమిటీ సమావేశం అయింది. ఈ ప్యానెల్ లో ప్రధాని మోడీతో పాటు, లోకసభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ సభ్యులుగా ఉన్నారు.
ఎంపిక చేసిన సభ్యుల నుంచి ఒకరిని షార్ట్ లిస్ట్ చేయాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యక్తిని రాహుల్ గాంధీ వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. కాగా ఎన్నికల కమిషనర్ ఎన్నిక వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున.. తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని రాహుల్ తెలిపారు . అయితే షార్ట్ లిస్ట్ సభ్యుల్లో జ్ఞానేశ్ కుమార్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఈ విషయాన్ని సోమవారం రాత్రి బాగా పొద్దుపోయాక న్యాయ మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో జ్ఞానేష్ కుమార్‌ను కొత్త CECగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. IAS అధికారి వివేక్ జోషి (హర్యానా కేడర్) ఎన్నికల కమిషనర్‌గా నియమితులైనట్లు కూడా నోటిఫికేషన్లో పేర్కొంది.
కొత్త సీఈసీ ఎంపిక చేసేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశం 30 నిమిషాల్లో ముగిసినప్పటికీ, రాహుల్ గాంధీ అసమ్మతిని సమావేశం మినిట్స్ బుక్‌లో నమోదు చేసారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్,ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) చట్టం, 2023 ప్రకారం, న్యాయ మంత్రి నేతృత్వంలో, భారత ప్రభుత్వ కార్యదర్శి హోదా కంటే తక్కువ కాని ఇద్దరు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ CEC, ఎన్నికల కమిషనర్లుగా నియామకం కోసం ఎంపిక కమిటీ పరిశీలన కోసం ఐదుగురు వ్యక్తుల ప్యానెల్‌ను సిద్ధం చేస్తుంది.
అదనంగా, సెర్చ్ కమిటీ సూచించిన వారికి మించి వ్యక్తులను పరిగణించే అధికారం కూడా సెలక్షన్ కమిటీకి ఉంది.
సోమవారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ, ఈ చట్టానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 19న సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని సెలక్షన్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాల్సి ఉందని అన్నారు.
ఇప్పటివరకు, సుప్రీంకోర్టు దీనికి సంబంధించి మూడు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 19న జరగనుంది. కాబట్టి, CEC ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ వైఖరి చాలా స్పష్టంగా ఉందని సింఘ్వి అన్నారు.