బెంగళూరు: ఉష్ణోగ్రతలు పెరగడం, భూగర్భ జలాలు తగ్గడం వంటి కారణాల వల్ల అనవసర కార్యకలాపాలకు తాగునీటిని వినియోగించడంపై బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు (BWSSB) ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాన్ని ఉల్లంఘించిన వారికి రూ. 5,000 జరిమానా విధిస్తామని తెలిపింది.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల చట్టం 1964లోని సెక్షన్లు 33 మరియు 34 ప్రకారం, వాహనాలను శుభ్రం చేయడానికి, తోటపని చేయడానికి, భవనాలు మరియు రోడ్ల నిర్మాణం, వినోద ప్రయోజనాల కోసం లేదా ఫౌంటైన్‌ల వంటి అలంకరణల కోసం బెంగళూరు నగరంలో త్రాగునీటిని ఉపయోగించడాన్ని BWSSB నిషేధించింది. అయితే
మాల్స్, సినిమా హాళ్లలో తాగునీటిని తాగడానికి మాత్రమే ఉపయోగించడానికి అనుమతి ఉంది.
“నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించినట్లయితే, మొదటిసారి నేరానికి రూ. 5,000 జరిమానా వర్తిస్తుంది. ఈ ఉల్లంఘన పునరావృతం అయితే రోజుకు రూ. 500 అదనపు జరిమానాతో పాటు రూ. 5,000 జరిమానా విధిస్తామని బెంగళూరు జలమండలి పేర్కొంది.
అందరికీ తాగునీటి సరఫరా తప్పనిసరి అని హైలైట్ చేస్తూ, ప్రస్తుతం నగరంలో ప్రతిరోజూ ఉష్ణోగ్రత పెరుగుతోందని, ఇటీవలి రోజుల్లో వర్షాలు లేకపోవడం వల్ల భూగర్భజల మట్టం తగ్గిందని BWSSB తెలిపింది. కాబట్టి, బెంగళూరు నగరంలో నీటి వృధాను నివారించడం అవసరం. ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకోవడం తప్పనిసరి అని చెప్పింది.
ప్రజలు నీటిని తగు అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలని, నిషేధ ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే వెంటనే బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు కాల్ సెంటర్ 1916కు తెలియజేయాలని ప్రజలను కోరారు.