న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన ఖతార్ అమీర్ తమిమ్ బిన్ హమద్ అల్ థానితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య రానున్న ఐదేళ్లలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కనీసం 28 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) కుదుర్చుకునేందుకు గల అవకాశాలను ఇరు వర్గాలు అన్వేషించాయని తెలిపింది. ప్రస్తుతమున్న ద్వైపాక్షిక సంబంధాల స్థాయిని వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్ళాలని ఇరు పక్షాలు భావించాయని మీడియాతో మాట్లాడుతూ కార్యదర్శి అరుణ్ కుమార్ చటర్జీ తెలిపారు. ద్వంద్వ పన్నులను నివారించే ఒప్పందంపై కూడా ఇరుపక్షాలు సంతకాలు చేశాయని తెలిపారు. ఇది కాకుండా వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, భద్రత వంటి పలు రంగాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ వేదికలపై సహకారం పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అంతేకాదు గల్ష్ సహకార మండలి సభ్య దేశాల్లో కువైట్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలతో భారత్ కూడా వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఇరు పక్షాలు అభిప్రాయాలు పంచుకున్నారని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.
సరిహద్దు ఉగ్రవాదంతో సహా అది ఏ రూపంలో ఉన్నా దానిని ఖండిస్తామని మోడీతో భేటీ సందర్భంగా ఖతర్ రాజు షేక్ తమీమ్ వెల్లడించారు. ద్వైపాక్షిక యంత్రాంగాల ద్వారా ఈ ముప్పును ఎదుర్కోవడంలో సహకరించుకోవాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. మనీలాండరింగ్ , మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరం, ఇతర అంతర్జాతీయ నేరాలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి వారు అంగీకరించారు.
సైబర్ భద్రతలో సహకారాన్ని ప్రోత్సహించడానికి గల మార్గాలను కూడా ఇద్దరు నాయకులు చర్చించారు, ఉగ్రవాదం, తీవ్రవాదం, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు సైబర్‌స్పేస్‌ను ఉపయోగించడాన్ని నిరోధించడం వంటి వాటిపై కూడా చర్చించారు. సమావేశం తర్వాత విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన ప్రకారం, భద్రత, చట్ట అమలుపై జాయింట్ కమిటీ క్రమం తప్పకుండా సమావేశాలను నిర్వహించాల్సిన ప్రాముఖ్యతను వారు నొక్కి చెప్పారు.
సంబంధిత కరెన్సీలలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరిష్కరించే అవకాశాన్ని అన్వేషించడానికి వారు అంగీకరించారు. ఖతార్ నేషనల్ బ్యాంక్ గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఒక కార్యాలయాన్ని ప్రారంభించనుంది.
పశ్చిమాసియా దేశానికి సావరిన్ వెల్త్ ఫండ్ అయిన ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ ప్రస్తుతం భారతదేశంలో రిటైల్, విద్యుత్, ఐటీ, విద్య, ఆరోగ్యం, సరసమైన గృహనిర్మాణం వంటి రంగాలలో సుమారు US $1.5 బిలియన్ల పెట్టుబడి పెట్టారని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరుణ్ కుమార్ ఛటర్జీ తెలిపారు. అంతేకాదు భారతదేశంలో $10 బిలియన్ల పెట్టుబడి పెట్టడానికి ఖతార్ ముందుకు వచ్చింది.