బెంగళూరు: ప్రస్తుత డిజిటల్ యుగంలో టీనేజ్ పిల్లలు చెడు వైపు త్వరగా ఆకర్షితులవుతున్నారు. చిన్న విషయాలకే తల్లిదండ్రులపై తిరుగుబాటు చేస్తున్నారు. పేరెంట్స్ తమ బిడ్డకు మంచి పెంపకం ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ, అందరు పిల్లలు బాధ్యతాయుతమైన టీనేజర్లుగా ఎదగరు. తోటివారి ఒత్తిడి, గృహ సమస్యలు, విచ్ఛిన్నమైన కుటుంబాలు, హార్మోన్ల మార్పుల కారణంగా టీనేజర్లు కొన్నిసార్లు తప్పుదారి పడుతున్నారు.. అలాంటి టీనేజర్లు… తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఉపాధ్యాయులతో కూడా కమ్యూనికేషన్ ఉండదు. వారు తరచుగా చదువులను నిర్లక్ష్యం చేస్తారు. హింసాత్మకంగా మారుతున్నారు.
టీనేజర్ల ఈ విపరీత ధోరణితో తల్లిదండ్రులు తెగ ఆందోళన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మెట్రో నగరమైన బెంగళూరులోని కుటుంబాలు తమ పిల్లలు ఏమి చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రైవేట్ డిటెక్టివ్‌లను ఆశ్రయిస్తున్నారు. టీనేజ్, చిన్న వయసులో ఉన్న పిల్లలు మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారని, లైంగికంగా చురుకుగా ఉంటారని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు.
తల్లిదండ్రులు ఇద్దరూ పనిచేస్తున్న కుటుంబాలలో కమ్యూనికేషన్ అంతరం పెరుగుతున్నందున టీనేజ్‌లపై నిఘా కోసం డిమాండ్ పెరుగుతోందని బెంగళూరులోని డిటెక్టివ్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో ఇందిరానగర్‌లోని లింక్స్ సెక్యూరిటీ అండ్ డిటెక్టివ్ సర్వీసెస్ సంస్థకు ఇటువంటి కేసుల సంఖ్య రావడం ఈ సంవత్సరం బాగా పెరిగింది. ఈ నెలలో ఏకంగా ఆరు కేసులు వచ్చాయి. M G రోడ్‌లోని వీనస్ డిటెక్టివ్ ఏజెన్సీ, స్లూత్స్ ఇండియా కన్సల్టెన్సీకి నెలకు 10 నుండి 15 కేసులు వస్తున్నాయి. మిగతా నగరాల్లో పనిచేస్తున్న ఈ ఏజెన్సీలు బెంగళూరు, ముంబై, సూరత్, అహ్మదాబాద్‌లు అత్యధిక సంఖ్యలో పిల్లల పర్యవేక్షణ కేసులను నమోదు చేస్తున్నాయని చెబుతున్నాయి.
తల్లిదండ్రులు తమ పిల్లలలో ఆకస్మిక మార్పులను గమనించినప్పుడు సహాయం కోరతారు. వీటిలో కొన్ని స్పష్టమైన సంకేతాలు ఏమిటంటే…. విద్యా పనితీరు, పాఠశాల లేదా కళాశాల హాజరు తగ్గడం, వారు ఎవరిని కలుస్తారనే వివరాలను పంచుకోకపోవడం, ఎవరినీ తమ గదిలోకి అనుమతించకపోవడం, బాత్రూంలో గంటల తరబడి గడపడం, అలసిపోయినట్లు కనిపించడం, చెడు భాషను ఉపయోగించడం, ఎక్కువ డబ్బు అడగడం దొంగతనం చేయడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. .
జెపి నగర్‌లోని ఎయిమ్ డిటెక్టివ్ ఏజెన్సీ వ్యవస్థాపకుడు దీపక్ మాట్లాడుతూ… “పిల్లలు గ్రూప్ స్టడీ పేరుతో దూరంగా ఉంటారు, రెండు లేదా మూడు రోజులు ఇంటికి తిరిగి రారు. వారు తల్లిదండ్రుల కాల్‌లకు స్పందించరు అని చెప్పారు”
మాదకద్రవ్యాల దుర్వినియోగం
12 – 13 ఏళ్ల వయస్సు ఉన్నవారితో సంబంధం ఉన్న కేసులలో కూడా మాదకద్రవ్యాల దుర్వినియోగం ఒక సాధారణ విషయం అని ఈ ఏజెన్సీలు పేర్కొన్నాయి. ఈ మేరకు వీనస్ డిటెక్టివ్ ఏజెన్సీ వ్యవస్థాపకురాలు అకృతి ఖత్రి మాట్లాడుత…, “ఒక కుటుంబం తమ కొడుకు ప్రేమలో పడ్డాడని అనుమానిస్తూ మమ్మల్ని సంప్రదించింది. అతను మాదకద్రవ్యాలు తీసుకుంటున్నాడు. 90% కేసులలో మేము దీనిని చూస్తాము. పిల్లలు తమ పాఠశాలలు, కళాశాలల వెలుపల సమూహాలలో ఈ పనులు చేస్తున్న ఫోటోలు, వీడియోలను మేము తీశాము. మేము (ఈ ప్రదేశాల నుండి) సాచెట్లను కూడా సేకరించామని ఆయన వెల్లడించారు.”
లింక్స్ సెక్యూరిటీ అండ్ డిటెక్టివ్ సర్వీసెస్ ఇటీవల ఒక జూనియర్ కళాశాల విద్యార్థిని పర్యవేక్షించడానికి నియమితమైంది. బెంగళూరులో ఎడ్ షీరాన్ తన స్నేహితులతో కలిసి నిర్వహించే కచేరీకి హాజరు కావాలని మొండి పట్టు పడుతున్నాడు. మా నిఘాలో తేలిన విషయమేమిటంటే “అతను ఒక అమ్మాయితో బయటకు వెళ్లి మద్యం సేవించి, ధూమపానం చేస్తున్నాడని తేలిందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నిఖిల్ గిరి చెప్పారు.
“పిల్లల పర్యవేక్షణ కేసుల్లో 99%లో మాదకద్రవ్య దుర్వినియోగం” ఉందని తన ఏజెన్సీ కనుగొన్నట్లు యిమ్ డిటెక్టివ్ ఏజెన్సీ వ్యవస్థాపకుడు దీపక్ పేర్కొన్నారు.
డబ్బుకోసం వెంపర్లాట
“OTT షోలలో తరుచుగా కనిపించే ఫ్యాన్సీ దుస్తులు, ఉపకరణాలు, కార్లు కావాలని నేటి తరం టీనేజర్లు కోరుకుంటున్నారని స్లూత్స్ ఇండియా కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ నమన్ జైన్ అన్నారు. “బెంగళూరులోని కాల్ సెంటర్‌లో చేరిన ఆరు నెలల్లోనే ఒక కళాశాల విద్యార్థి కారు కొన్నాడు, కానీ అతను ఎక్కడ పనిచేశాడో తన తల్లిదండ్రులకు చెప్పలేదు. అతను కాల్ సెంటర్‌లో పనిచేశాడని, ప్రజలను మోసం చేస్తున్నాడని మేము కనుగొన్నాము” అని ఆయన చెప్పారు.
టీనేజర్లు ఎక్కువగా ఆన్‌లైన్ జూదం వైపు మొగ్గు చూపుతున్నారని జైన్ చెప్పారు. “అతను కుటుంబ ఆభరణాలను తాకట్టు పెట్టి 4-5 లక్షల అప్పులు చేశాడు,” అని అతను చెప్పాడు. అంతేకాదు చాలా పెద్ద వయసు మహిళలతో సంబంధాలు కొనసాగిస్తున్న కళాశాల విద్యార్థులు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నారని ఆయన చెప్పారు.
సమాచార హ్యాకింగ్
సర్కిల్ డిటెక్టివ్ ఏజెన్సీ, HAL ఫేజ్ II వ్యవస్థాపకురాలు ఆర్తి సీతారామన్ మాట్లాడుతూ… ఇంకా పిల్లల పర్యవేక్షణ అంశాన్ని చేపట్టలేదు. తల్లిదండ్రులుగా నటిస్తూ కుట్రపూరితమైన బంధువులు తాము అందించే సాక్ష్యాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. దీంతో ముగ్గురు పేరెంట్స్ వెనక్కి తగ్గారని ఆమె అన్నారు.
దర్యాప్తు తర్వాత ఏం జరుగుతుంది
కొన్ని డిటెక్టివ్ ఏజెన్సీలకు కౌన్సెలర్లు, పునరావాస కేంద్రాల నెట్‌వర్క్ ఉంది, తమ బిడ్డ ఏదైనా దాస్తున్నట్లు ఆధారాలు దొరికితే తల్లిదండ్రులు ధృడంగా వ్యవహరించాలని మెట్రోలైఫ్ చైల్డ్ కౌన్సెలర్ హన్నా అవేజ్‌అంటున్నారు.
జేబుకు చిల్లు…
డిటెక్టివ్‌ను నియమించుకోవడానికి రోజుకు 5,000 నుండి 10,000 లేదా వారానికి 35,000 వరకు ఖర్చవుతుంది. 2.5 లక్షల వరకు ప్యాకేజీలు ఉంటాయి. పాఠశాలలు, కళాశాలలు, పబ్‌లు, రెస్టారెంట్లు, కచేరీలు వంటి బహిరంగ ప్రదేశాలలో డిటెక్టివ్‌లు టీనేజ్ పిల్లలను పర్యవేక్షిస్తారు. మైనర్లకు, కొందరు తల్లిదండ్రులకు డిజిటల్ పరికరాల్లో పిల్లల పర్యవేక్షణ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడంలో, పిల్లల గదిని బగ్ చేయడంలో సహాయం చేస్తారు.
ఈ అంశంపై న్యాయవాది సిజి మలైల్ మాట్లాడుతూ, ఇటువంటి తల్లిదండ్రుల నిఘా చట్టపరమైన పరిమితుల్లోనే ఉంటుంది. ఎక్కువగా ఉన్నత-మధ్యతరగతి,సంపన్న కుటుంబాలు ఇటువంటి దర్యాప్తులను కోరుకుంటాయని తెలిపారు.