చెన్నై: జాతీయ విద్యా విధానంలో భాగంగా రూపొందించిన త్రిభాషా ఫార్ములా కింద తమిళనాడుపై హిందీని రుద్దడానికి కేంద్ర విద్యాశాఖా మంత్రి ప్రయత్నిస్తున్నారని సీఎం స్టాలిన్ విమర్శించారు. రాష్ట్రానికి హాని కలిగించే దేనిని తాను అనుమతించబోనని స్టాలిన్ అన్నారు. తమిళ గుర్తింపును సవాలు చేయవద్దని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సీఎం స్టాలిన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమిళనాడు అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. “రాష్ట్రాలు అభివృద్ధి చెంది బలంగా మారినప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర వృద్ధిని చూడటానికి ఇష్టపడదు, దానిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. వారు జిఎస్‌టి ద్వారా మన ఆదాయాన్ని లాక్కున్నారు. వారు కొత్త పథకాలను ప్రకటించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవడానికి ఉద్దేశించిన నిధులు విడుదల కాలేదు. ఈ పరిస్థితులలో కూడా, మేము కొత్త పథకాలను అమలు చేస్తూనే ఉన్నాము. వారు దీనిని అంగీకరించలేకపోతున్నారు, ”అని సీఎం స్టాలిన్ అన్నారు.
జాతీయ విద్యా విధానాన్ని కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శించారు, ఇది అణగారిన వర్గాల విద్యార్థులకు ప్రతికూలత కలిగించేలా రూపొందించారని అన్నారు. “జాతీయ విద్యా విధానం మన పిల్లలు విద్యను పొందకుండా లేదా ఉద్యోగాలు పొందకుండా నిరోధించడానికి ఉద్దేశించారు. వంద సంవత్సరాల క్రితం, మన ప్రజలకు విద్యను పొందే అవకాశం నిరాకరించారు. సామాజిక న్యాయాన్ని నిర్ధారించడానికి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన వర్గాలకు విద్యా సంస్థల తలుపులు తెరవడానికి రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. ఇప్పుడు, ఈ సామాజిక న్యాయాన్ని రద్దు చేయడానికి, తమిళనాడులో ఈ వర్గాల పురోగతిని ఆపడానికి NEP తీసుకొచ్చారని,” సీఎం స్టాలిన్ అన్నారు.
అంతేకాదు ద్రవిడ మున్నేట్ర కజగం విద్యను రాజకీయం చేస్తోందని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్పందించారు. “మేము ప్రజల సంక్షేమం కోసం నిధులను ఉపయోగిస్తాము. మీరు వాటిని మతపరమైన విభజనలను సృష్టించడానికి, హిందీని బలవంతంగా రుద్దడానికి ఉపయోగిస్తున్నారని స్టాలిన్ అన్నారు.
కాగా, కేంద్ర విద్యాశాఖా మంత్రి మాట్లాడుతూ… PM SHRI పథకాన్ని అంగీకరించనందున తమిళనాడు రూ. 5,000 కోట్లు కోల్పోతోందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తమిళనాడు నుండి మీకు వచ్చే పన్ను ఆదాయాన్ని మేము అందించబోమని చెప్పడానికి మాకు ఒక్క క్షణం పడుతుంది. విద్యను మెరుగుపరచడానికి కాకుండా హిందీని ప్రోత్సహించడానికి NEP ప్రవేశపెట్టలేదపి ఆయన అన్నారు.
తమ రాష్ట్రంపై హిందీని ప్రత్యక్షంగా రుద్దితే కేంద్రం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది, కాబట్టి దీనిని విద్యా సంస్కరణగా మారువేషంలో ఉంచారు. మాతృభాషలు సుసంపన్నం అవుతాయని కేంద్ర మంత్రి చెబుతున్నారు. మా మాతృభాషను ఎలా సుసంపన్నం చేయాలో మాకు తెలుసు, ధర్మేంద్ర ప్రధాన్,” అని స్టాలిన్ అన్నారు.
సీఎం స్టాలిన్ తన ప్రసంగాన్ని ఒక హెచ్చరికతో ముగించారు. తేనెతుట్టెపై రాళ్లు విసరవద్దు. తమిళుల గుర్తింపును సవాలు చేయవద్దు. నేను ఇక్కడ (డీఎంకే) ఉన్నంత వరకు, ఈ గడ్డపై తమిళం, తమిళనాడు లేదా తమిళులకు వ్యతిరేకంగా ఏమీ అనుమతించమని,” స్టాలిన్ అన్నారు.