హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఓకే అంది. మొత్తం 14,236 అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగ మేళాను ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. రాబోయే నోటిఫికేషన్‌లో 6,399 అంగన్‌వాడీ టీచర్లు, 7,837 మంది హెల్పర్ల నియామకాన్ని చేపట్టనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,700 అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ప్రీ ప్రైమరీ విద్యను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే అంగన్వాడీల్లో ఖాళీలుంటే నిర్దేశించుకున్న లక్ష్యాల అమలు కష్టసాధ్యం అవుతుందన్న ఉద్దేశంతో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖకు సూచించింది. దీంతో పదవీవిరమణకు అర్హత సాధించిన వారు, పదోన్నతికి అర్హత ఉన్న వారితోపాటు కేటగిరీలవారీగా ఖాళీలను లెక్కించి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది.
మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు, జిల్లా కలెక్టర్లు నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలను అందించనున్నారు. మొత్తంమీద, రాష్ట్ర ప్రభుత్వం 14,236 పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది, ఈ స్థాయిలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకం చేపట్టడం తెలంగాణలో ఇదే మొదటిసారి. ఈ చొరవ అంగన్‌వాడీ వర్కర్ వ్యవస్థ ప్రభావాన్ని మరింత పెంచుతుంది.