చెన్నై : జాతీయ విద్యా విధానంపై తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విద్యను రాజకీయం చేస్తోందని, తమపై బలంగా హిందీ భాషను రుద్దాలని ప్రయత్నిస్తోందని , పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమినాడు మరో భాషా ఉద్యమానికి సిద్ధంగా ఉందని సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించారు. సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోక్‌సభ స్థానాల పునర్విభజన అంశాన్ని చర్చించేందుకు మార్చి 5న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
భారత ఎన్నికల కమిషన్‌లో నమోదైన దాదాపు 40 రాజకీయ పార్టీలను అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానించామని, రాజకీయ విభేదాలను అధిగమించి ఐక్యత కోసం కదిలిరావాలని విజ్ఞప్తి చేశారు.
దీనికి స్పందించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు త్రిభాషా విధానంపై తన వాదనను తిరస్కరించినందున డీలిమిటేషన్‌కు సంబంధించి “ఊహాత్మక భయం”తో స్టాలిన్ ఇప్పుడు “కథనాన్ని మార్చడానికి” ప్రయత్నిస్తున్నారని అన్నారు. బిజెపి ఈ అఖిల పక్ష సమావేశానికి హాజరు కాకపోవచ్చునని ఆయన సూచించారు.
మరోవంక సీఎం మీడియాతో మాట్లాడుతూ… లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో తమిళనాడులో 8 లోక్‌సభ స్థానాలను తగ్గించేలా కేంద్రప్రభుత్వం కుట్రపన్నుతోందని సీఎం స్టాలిన్ ఆరోపించారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా నిర్వహించి దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న దక్షిణ భారతదేశంపై నియోజకవర్గాల పునర్విభజన కత్తి వేలాడదీయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఎంపీ సీట్ల సంఖ్యను తగ్గించకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు మార్చి 5న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో తమిళనాడులో ఎంపీ సీట్లు 39 నుంచి 31కి పడిపోతాయని వివరించారు.
“భాషా యుద్ధం” అనేది 1965లో డీఎంకే హిందీ వ్యతిరేక ఆందోళనను సూచిస్తుంది, తమిళ ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దారనే ఆరోపణలకు వ్యతిరేకంగా ద్రావిడ పార్టీ విజయవంతంగా ప్రచారం చేసింది.
అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం కాపీలో, కేంద్ర నిధుల కేటాయింపుతో సహా రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను స్టాలిన్ హైలైట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడులో లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గడం రాష్ట్రాన్ని మరింత ప్రభావితం చేస్తుంది. తమిళనాడు ప్రయోజనాల దృష్ట్యా ఐక్యతను ప్రదర్శించడం తక్షణ అవసరం అని సీఎం అన్నారు.