వాషింగ్టన్ డీసీ : అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ఉక్రేనియన్, రష్యా సంఘర్షణను అంతం చేయడానికి అమెరికా అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ట్రంప్ తన ప్రసంగంలో అన్నారు.
ఈ భయంకరమైన, సంఘర్షణలో లక్షలాది మంది ఉక్రేనియన్లు, రష్యన్లు అనవసరంగా చనిపోయారు, గాయపడ్డారు, యుద్ధం అంతం కనుచూపు మేరలో లేదు. ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా వందల బిలియన్ల డాలర్లను పంపింది” అని ట్రంప్ అన్నారు. అదేసమయంలో యూరోపియన్ మిత్రదేశాలను కూడా అధ్యక్షుడు విమర్శించారు, వారు ఉక్రెయిన్ను రక్షించడం కంటే రష్యా చమురు, గ్యాస్‌పై ఎక్కువ ఖర్చు చేస్తున్నారని, అమెరికా భారాన్ని మోస్తుందని అన్నారు.
మరోవంక, వైట్ హౌస్ ఘర్షణ తర్వాత తర్వాత, రష్యాతో చర్చలకు, అమెరికాతో ఖనిజ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి కీవ్ సిద్ధంగా ఉందని ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ తనకు చెప్పారని ట్రంప్ అన్నారు. “నాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నుండి ఒక ముఖ్యమైన లేఖ అందింది. ఆ లేఖలో, ‘శాశ్వత శాంతిని దగ్గరకు తీసుకురావడానికి ఉక్రెయిన్ వీలైనంత త్వరగా చర్చలకు రావడానికి సిద్ధంగా ఉంది. ఉక్రేనియన్ల కంటే ఎవరూ శాంతిని ఎక్కువగా కోరుకోరు’ అని ట్రంప్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అన్నారు’.
ఇదిలా ఉండగా సుంకాలపై మాట్లాడుతూ…కొన్ని దేశాలు దశాబ్దాల పాటూ అమెరికాపై టారిఫ్‌లు విధుస్తున్నట్లు ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారత్ వంటి చాలా దేశాలు తమ నుంచి అధిక సుంకాలు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఇది చాలా అన్యాయమన్నారు. భారత్ తమపై 100 శాతం కంటే ఎక్కువ టారిఫ్‌లు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ‘భారత్ మాపై 100 శాతం కంటే ఎక్కువ సుంకాలను వసూలు చేస్తోంది. మా ఉత్పత్తులపై చైనా సగటు సుంకం మనం వసూలు చేసే దానికంటే రెండింతలు ఎక్కువ. ఇక దక్షిణ కొరియా సగటు సుంకం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనకు సమయం వచ్చింది. భారత్, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేయనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం అంశాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించారు వాణిజ్య యుద్ధం ప్రారంభమైనప్పటికీ వినియోగదారులకు ధరలను తగ్గించడానికి తాను “ప్రతిరోజూ పోరాడుతున్నాను” అని అన్నారు. “భూమిపై ఉన్న ప్రతి దేశం అమెరికాను దశాబ్దాలుగా దోచుకుంటోంది, ఇకపై అలా జరగనివ్వము” అని ట్రంప్ అన్నారు. “మీరు అమెరికాలో మీ ఉత్పత్తిని తయారు చేయకపోతే, మీరు సుంకం చెల్లించాల్సిందేనని ట్రంప్ అన్నారు.