రియాద్: పవిత్ర రంజాన్ సందర్భంగా అనేక భారతీయ నగరాల్లో సౌదీ అరేబియా ఇఫ్తార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు సౌదీ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇఫ్తార్ ప్రోగామ్ను ఒక ప్రధాన మానవతా సాయంగా పరిగణించిన సౌదీ… దీనిని నేపాల్, మాల్దీవులు, శ్రీలంకతో సహా పొరుగు దేశాలకు విస్తరించింది.
ఇఫ్తార్ కార్యక్రమం ద్వారా భారతదేశంలో 50,000 కంటే ఎక్కువ మంది లబ్ధి పొందనున్నారు. ఇక మిగతా నాలుగు దేశాలలో దాదాపు 100,000 మంది లబ్ధిదారులు ఉంటారని అంచనా. ఈ కార్యక్రమం పవిత్ర మాసంలో ఐక్యతను పెంపొందించడానికిరూపొందించారని సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) తెలిపింది.
రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు ప్రారంభించిన ఇఫ్తార్ కార్యక్రమంలో, సౌదీ రాయబార కార్యాలయాలు, గుర్తింపు పొందిన దాతృత్వ కేంద్రాలు, ఇస్లామిక్ ప్రముఖులు పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందులు నిర్వహిస్తారు. దీనివల్ల ఇఫ్తార్ అవసరమైన వారికి ఇవి సమర్థవంతంగా చేరుతాయి.
కాగా, సౌదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని లబ్ధిదారులు ప్రశంసించారు. రంజాన్ సందర్భంగా మద్దతు ఇచ్చినందుకు రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కోసం దుఆ చేశారు.