ఇస్లామాబాద్: బెలూచిస్థాన్ వేర్పాటువాదులు పాక్‌లో వరుసగా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా 400 మందికి పైగా ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను నిన్న హైజాక్ చేశారు. ఈ ఘటనతో పాక్ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. వందమందికి పైగా బందీలను రక్షించాయి. ఈ సందర్భంగా భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో కనీసం 16 మంది తిరుగుబాటుదారులు మరణించారని అధికారులు తెలిపారు.
కాగా, రక్షించిన వారిలో 58 మంది పురుషులు, 31 మంది మహిళలు సహా 15 మంది పిల్లలను సమీపంలోని మాక్ పట్టణానికి తరలించారు, అక్కడ తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేసారు. మరోవంక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) తిరుగుబాటుదారులు, పాకిస్తాన్ దళాల మధ్య కాల్పులు రాత్రిపూట కొనసాగాయి. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో ఎంత మంది బందీలు ఉన్నారో స్పష్టంగా తెలియటంలేదు. అయితే తమ తరుపున ప్రాణనష్టాన్ని బీఎల్‌ఏ ఖండించింది. 30 మంది సైనికులను చంపినట్లు పేర్కొంది, దీనిని అధికారులు ధృవీకరించలేదు.
జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను క్వెట్టా నుండి పెషావర్‌కు వెళ్లే మార్గంలో ఒక మారుమూల ప్రాంతంలోని సొరంగం వద్ద కొంతమంది సాయుధులు అడ్డుకున్నారు. ఆ రైలులోని మొత్తం తొమ్మిది బోగీలలో కనీసం 400 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇటీవలే ఈ మార్గం పనిచేయడం ప్రారంభించింది.
కాగా, తామే ఈ రైలును హైజాక్ చేసినట్టు బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. టన్నెల్స్ వద్ద పట్టాలను పేల్చేసి రైలును తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. లోకోమోటివ్ డ్రైవర్‌ను కూడా చంపారు. మరోవంక బందీలను కాపాడేందుకు సైనిక చర్య ప్రారంభించామని, చివరి ఉగ్రవాదిని మట్టుబెట్టేవరకు ఇది కొనసాగుతుందని పాకిస్తాన్ భద్రతా బలగాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా జైళ్లలో ఉన్న బలూచిస్థాన్ ఉద్యమకారులందరినీ విడిచిపెట్టాలని బీఎల్‌ఏ డిమాండ్ చేసింది. వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని పాక్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 48 గంటల్లోగా బలూచిస్థాన్ రాజకీయ ఖైదీలు, ఇతర ఉద్యమకారులను విడిచిపెట్టకపోతే బందీలందరినీ చంపేస్తామని హెచ్చరించింది.
తిరుగుబాటుదారుల చేతిలో బందీలుగా ఉన్న ప్రయాణికుల బంధువులకు సహాయం చేయడానికి పెషావర్,క్వెట్టా రైల్వే స్టేషన్లలో అత్యవసర డెస్క్‌లను ఏర్పాటు చేశారు.
పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ దాడిని ఖండించగా, అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ బలూచిస్తాన్‌లో హింసకు పాల్పడటం ద్వారా దేశంలో అస్థిరతను సృష్టించడానికి “శత్రు దళాలు” కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.
గత కొన్ని నెలలుగా బలూచిస్తాన్‌లో బలూచిస్థాన్ వేర్పాటువాదులు పాక్‌లో వరుసగా దాడులకు పాల్పడుతున్నారు. పోలీస్ స్టేషన్లు, రైల్వే మార్గాలు, వాహనాలపై దాడులు చేస్తున్నారు. గత నవంబరులో క్వెట్టా రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 26 మంది మరణించారు. 62 మంది గాయపడ్డారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌కు ఇరాన్, అఫ్ఘానిస్థాన్ సరిహద్దులుగా ఉన్నాయి. బలూచ్ ప్రజల స్వయం నిర్ణయాధికారం, పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం కోరుతూ పాక్ సైన్యంతో పోరాడుతున్నాయి.