టెహ్రాన్: ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమేనికి లేఖ రాసారు. దీనిపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మాట్లాడుతూ, ఇరాన్ అమెరికాతో చర్చలు జరపదని, “మీకు నచ్చింది మీరు చేసుకోండని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బదులిచ్చినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. .
“అమెరికా ఆదేశాలు ఇవ్వడం, బెదిరింపులకు దిగడం మాకు ఆమోదయోగ్యం కాదు. నేను మీతో చర్చలు కూడా జరపను. మీకు కావలసినది చేయండి” అని పెజెష్కియాన్ చెప్పినట్లు సమాచారం. కొత్త అణు ఒప్పందంపై చర్చల్లో పాల్గొనమని ఇరాన్‌ను కోరుతూ డొనాల్డ్ ట్రంప్ లేఖ పంపినట్లు చెప్పిన ఒక రోజు తర్వాత, చర్చల పేరిట ఇరాన్‌ను బెదిరిస్తే తాము భయపడమని అన్నారు.
కాగా, అణు ఒప్పందంపై ఇరాన్‌తో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి లేఖ రాసినట్లు చెప్పారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. చర్చలకు వారు అంగీకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
“ఇరాన్ ముందు రెండు మార్గాలున్నాయి. సైన్యం, లేదా ఒప్పందం చేసుకోవడం. ఒప్పందానికే నేను ప్రాధాన్యం ఇస్తా. ఎందుకంటే ఇరాన్‌ను దెబ్బతీయాలనుకోవడం లేదు. చర్చలు జరుపుతారని ఆశిస్తున్నా. ఇరాన్‌కు అది చాలా ప్రయోజనకరం” అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్ మరో అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోవడాన్ని నిలువరించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఇదే అంశంపై ఇటీవల మాట్లాడిన ట్రంప్.. దాన్ని నిరోధించేందుకు గాను వారితో ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పారు. ఇదిలాఉంటే, ఇరాన్‌తో గతంలో అణు ఒప్పందం చేసుకున్న అమెరికా.. 2018లో ట్రంప్ హయాంలోనే దాన్నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.