వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యెమెన్ లోని హౌతీ మిలిటెంట్లపై సైనిక చర్యను ప్రారంభించారు. ఈ దాడిలో పదుల సంఖ్యలో హౌతీలు చనిపోయారు. ఎర్ర సముద్రంలో షిప్పింగ్ పై దాడులు చేస్తున్న హౌతీలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడి జరిగింది. ఇరాన్ సహాయంతో హౌతీలు రెచ్చిపోతున్నారని, ఈ చర్యతో టెహ్రాన్ పై ఒత్తిడిని పెంచాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ దాడులు మరికొన్ని వారాల పాటు కొనసాగవచ్చని ఒక అమెరికా అధికారి తెలిపారు
హౌతీల చరిత్ర ?
యెమెన్‌కు ఉత్తరాన ఉన్న హౌతీ కుటుంబం 1990ల చివరలో షియా ఇస్లాంకు చెందిన జైదీ తెగ కోసం మతపరమైన పునరుజ్జీవన ఉద్యమాన్ని ఏర్పాటు చేసింది. కానీ వారి ఉత్తర కేంద్ర ప్రాంతం పేదరికం కారణంగా వారి ఉద్యమం ముందుకు సాగలేదు. రాజధాని సనాలో ప్రభుత్వంతో ఘర్షణ పెరిగేకొద్దీ, వారు జాతీయ సైన్యంతో వరుస గెరిల్లా యుద్ధాలు, సున్నీ ముస్లిం సౌదీ అరేబియాతో క్లుప్తమైన సరిహద్దు వివాదంలో పాల్గొన్నారు. అబ్దుల్ మాలిక్ అల్-హౌతీ.. హౌతీల నాయకుడిగా ఉన్నాడు. హౌతీ ఉద్యమ నేతగా ఎదగడానికి ముందు అల్-హౌతీ ఒక భయంకరమైన వార్ కమాండర్‌గా ఖ్యాతిని సంపాదించాడు.
హౌతీ నాయకుడు ఎవరు?
అబ్దుల్ మాలిక్ అల్-హౌతీ ప్రపంచ శక్తులను సవాలు చేసే ధిక్కార దళాన్ని పర్వత యోధుల బృందం నుండి సృష్టించారు. అల్-హౌతీ హౌతీ ఉద్యమానికి అధిపతిగా ఎదగడానికి ముందు వార్ కమాండర్‌గా ఖ్యాతిని సంపాదించాడు.
40 ఏళ్ల వయసున్న అల్-హౌతీ నేతృత్వంలో, ఈ బృందం పదివేల మంది యోధుల సైన్యంగా ఎదిగింది. అంతేకాదు సాయుధ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను భారీగా సేకరించింది. ఈ ఆయుధాలన్నీ ఇరాన్ నుండి వచ్చాయని సౌదీ అరేబియా, పశ్చిమ దేశాలు చెబుతున్నాయి, అయితే టెహ్రాన్ దీనిని ఖండించింది. ఈ అల్-హౌతీ ఎప్పుడూ ఒక చోట ఉండడు, మీడియాను అస్సలు కలవడు, అలాగే బయట ఎక్కువ తిరగడు.
హౌతీలు యెమెన్‌లో ఎక్కువ భాగాన్ని ఎలా నియంత్రించారు?
2014 చివరలో హౌతీలు సనాను ఆక్రమించుకున్నప్పుడు యెమెన్‌లో అంతర్యుద్ధం చెలరేగింది. ఇరాన్ సరిహద్దులో పెరుగుతున్న ప్రభావంతో ఆందోళన చెందిన సౌదీ అరేబియా 2015 మార్చిలో పాశ్చాత్య దేశాల మద్దతుగల సంకీర్ణ కూటమికి నాయకత్వం వహించింది. హౌతీలు ఉత్తరాన పెద్ద నగరాల్లో నియంత్రణను ఏర్పరచుకున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి జరిపిన చర్చల కారణంగా యెమెన్ కొంతకాలం ప్రశాంతంగా ఉంది, కానీ గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ప్రాంతీయ ఉద్రిక్తతలు తీవ్రంగా పెరగడం వల్ల మిలీషియా, రియాద్ మధ్య కొత్త సంఘర్షణ పెరిగే ప్రమాదం ఉంది.
ఓడలపై దాడులు ఎందుకు?
పాలస్తీనియన్లు, గాజాను నియంత్రించే ఇస్లామిస్ట్ గ్రూపు అయిన హమాస్‌కు మద్దతుగా ఎర్ర సముద్రంలోని షిప్పింగ్ మార్గాలపై దాడులతో హౌతీలు గాజా వివాదంలోకి దిగారు. గల్ఫ్ ఆఫ్ ఆడెన్, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, మధ్యధరా సముద్రంలో ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న ఓడలపై దాడులు జరిగాయని కూడా వారు పేర్కొన్నారు.
హౌతీ దాడులు ప్రపంచ షిప్పింగ్‌కు అంతరాయం కలిగించాయి, సంస్థలు దక్షిణ ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. దీంతో షిప్పింగ్ సంస్థలకు ఖర్చు తడిసిమోపెడయ్యింది.
ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్‌తో సంబంధాలు ఉన్న ఓడలపై మాత్రమే దాడి చేసినట్లు మిలీషియా చెప్పినప్పటికీ, షిప్పింగ్ పరిశ్రమ వర్గాలు అన్ని ఓడలు ప్రమాదంలో ఉన్నాయని చెబుతున్నాయి.
ప్రపంచ షిప్పింగ్ ట్రాఫిక్‌లో దాదాపు 15% వాటా కలిగిన యూరప్, ఆసియా మధ్య కీలకమైన మార్గంలో స్వేచ్ఛా వాణిజ్య ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలలో భాగంగా అమెరికా, బ్రిటన్ హౌతీలపై వైమానిక దాడులతో ప్రతీకారం తీర్చుకున్నాయి.
గాజా కాల్పుల విరమణతో పాటు జనవరిలో కాస్త ప్రశాంతత నెలకొంది. కానీ మార్చిలో ఇజ్రాయెల్ గాజాకు వచ్చే సహాయాలను అడ్డుకోవడంతో మార్చి 12న హౌతీలు తక్షణమే దాడులను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు ప్రారంభమైంది. సహాయబృందాలపై ఆంక్షలు ఎత్తివేయకపోతే మార్చిలో తన నావికా కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తామని ఆ బృందం హెచ్చరించింది.
ఇరాన్‌తో హౌతీలకు ఉన్న సంబంధాలు ఏమిటి?
ఇరాన్ మద్దతుతో హమాస్, హిజ్బుల్లా, హౌతీలతో సహా ప్రాంతీయ మిలీషియాలు “యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్” పేరిట ఇజ్రాయెల్, పాశ్చాత్య వ్యతిరేక కూటమిగా ఏర్పడ్డారు. అమెరికాకు మరణం, ఇజ్రాయెల్‌కు మరణం, యూదులకు శాపం, ఇస్లాంకు విజయం” అనేది హౌతీ నినాదం.
సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి… టెహ్రాన్ హౌతీలకు ఆయుధాలు, శిక్షణ ఇస్తోందని ఆరోపిస్తోంది, ఈ ఆరోపణ రెండూ ఖండిస్తున్నాయి. లెబనాన్‌లోని ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా హౌతీలకు సహాయం చేస్తోందని కూడా సంకీర్ణం చెబుతోంది, అయితే ఈ ఆరోపణను ఇరాన్, హౌతీ గ్రూపు ఖండించాయి.