హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం పథకం లబ్దిదారులకు జూన్ 2న రుణ మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు బ్యాంకు రుణాలు పొందేందుకు ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఐదు లక్షల మంది యువతకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న రుణ మంజూరు లేఖలు అందించనున్నారు.
ఈ మేరకు డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో లబ్ధిదారుల కోసం దరఖాస్తు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. పోటీ పరీక్షల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేని వారికి అవకాశాలను కల్పించడం, స్వయం ఉపాధి పొందేందుకు వీలు కల్పించడం ఈ పథకం లక్ష్యమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. యూనిట్ మోడల్‌ను బట్టి, రూ.50,000 నుండి రూ.4,00,000 వరకు రుణాలు ఈ పథకం ద్వారా లభిస్తాయని ఆయన వివరించారు.
ప్రతి నియోజకవర్గం నుండి 5,000 మంది లబ్ధిదారులు ఈ పథకాన్ని పొందొచ్చని, దరఖాస్తుదారులు వెబ్‌సైట్ నుండి ఫారమ్‌లను డౌన్‌లోడ్ చేసుకుని రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోరారు. దరఖాస్తులను ముందుగా మండల స్థాయిలో, తరువాత జిల్లా స్థాయిలో పరిశీలించి, చివరకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు ఆమోదిస్తారని భట్టి అన్నారు. తెలంగాణ స్వయం ఉపాధి పథకం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తూ, ఈ పథకం తీసుకొచ్చామని డిప్యూటి సీఎం చెప్పారు.
ఐటిఐ గ్రాడ్యుయేట్లు, కారు డ్రైవర్లు, ఎలక్ట్రిక్ వాహన డ్రైవర్లు వంటి సాంకేతిక అర్హతలు కలిగిన దరఖాస్తుదారులకు ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… భట్టి విక్రమార్కకు సూచించారు.
ఇందిరమ్మ ఇల్లు గృహ పథకం, రాజీవ్ యువ వికాసం పథకంతో సహా ప్రతి పథకంలో మైనారిటీలు తమ వాటాను పొందుతారని కూడా ఆయన హామీ ఇచ్చారు.