గాజా : హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం గాజాపై మళ్లీ దాడులకు పాల్పడుతోంది. ఓవైపు రెండో దశ చర్చలకు సిద్ధమవుతూనే గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ పరిణామాలపై ఖిన్నుడైన టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ ఇజ్రాయెల్‌ను “ఉగ్రవాద దేశం”గా అభివర్ణించారు.
“నిన్న రాత్రి గాజాపై జరిగిన క్రూరమైన దాడులతో జియోనిస్ట్ పాలకులు… అమాయకుల రక్తం, జీవితాలను కబళించే ఉగ్రవాద రాజ్యమని మరోసారి నిరూపించుకుంది” అని ఎర్డోగన్ రంజాన్ ఉపవాస విందులో అన్నారు.
కాగా, నిన్న తెల్లవారుజామున జరిగిన ఈ దాడుల్లో 400 మందికిపైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. వీరిలో ఎక్కుమంది మహిళలు, చిన్నారులే. హమాస్‌తో 17 నెలలుగా కొనసాగుతున్న పోరులో ఈ ఏడాది జనవరి నుంచి కాల్పుల విరమణ అమల్లో ఉన్నా, ఈ దాడితో ఆ ఒప్పందానికి తూట్లు పడినట్లయింది.
ఒప్పందంలో మార్పులు చేయడానికి హమాస్ తిరస్కరించడంతో దాడులకు పాల్పడాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు. ఖాన్యీూనిస్, రఫా, ఉత్తర గాజా, గాజాసిటీ ప్రాంతాల్లో తాజా వైమానిక దాడులు చోటుచేసుకున్నాయి.
బందీలను విడుదల చేయడానికి హమాస్ పదేపదే నిరాకరిస్తోందని, యుద్ధ లక్ష్యాలను సాధించడానికి గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు చేస్తోందని ఆయన Xలో పోస్టు చేశారు. ఇజ్రాయెల్ ఇప్పటినుంచి హమాస్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
అటు ఐడీఎఫ్ కూడా దీనిపై ప్రకటన చేసింది. హమాస్ ఉగ్ర ముఠాకు చెందిన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే భీకర దాడులకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. తూర్పు గాజాలోని ప్రజలు తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. ఆ ప్రాంతంలో మరిన్ని దాడులు చేపడతామని హెచ్చరించింది. గాజాపై వైమానిక దాడులు చేయకముందే ఇజ్రాయెల్ తమను సంప్రదించిందని అమెరికా అధ్యక్ష భవన వర్గాలు వెల్లడించాయి.