హైదరాబాద్: డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల కలిగే పరిణామాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ కసరత్తును తీవ్రంగా ఖండించారు. దక్షిణాది రాష్ట్రాల నాయకులు, ముఖ్యమంత్రులు చెన్నైలో నిర్వహించిన డీలిమిటేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఈ చర్య దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తుకు ముప్పు అని అభివర్ణించారు.
దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, డీలిమిటేషన్ వల్ల తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం చూపించే వివక్షతో దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా నష్టపోతాయని అన్నారు. జనాభా ఆధారంగా సీట్లు పెంచడం సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగించినట్లవుతుంది ఆయన పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా జీడీపీ ప్రకారం చూసుకోవాలని, దేశంలో తెలంగాణ జనాభా 2.8 శాతం ఉంటే జీడీపీ పరంగా చూస్తే 5.1 శాతం అందిస్తోందని వెల్లడించారు.
డీలిమిటేషన్‌తో దక్షిణాది భవిష్యత్తుకు పెను ప్రమాదం ఉందని అన్నారు. దశాబ్దాల నుంచి దక్షిణాదిపై వివక్ష కొనసాగుతున్నదని అన్నారు. ఈ విధానం కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, నిధుల కేంద్రీకరణతో పాటు ఆర్థిక నియంతృత్వానికి దారితీస్తుందని, దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తును నాశనం చేస్తుందని ఆయన హెచ్చరించారు. భారతదేశం ప్రజాస్వామిక దేశమైనప్పటికీ, భిన్న అస్తిత్వాలు, సంస్కృతులతో కూడిన సమాఖ్య రాష్ట్రమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
డీలిమిటేషన్ వల్ల కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరుగుతుంది. మరికొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం వలన ప్రాంతీయ అసమానతలు ఏర్పడి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. దక్షిణ భారతదేశానికి ఇచ్చే నిధుల కన్నా వచ్చే నిధులు మరింతగా తగ్గిపోతాయని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం నుంచి అందే సహాయంతో పాటు దక్షిణాదికి రాజకీయ ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోతుంది. దేశ అభివృద్ధికి సహకరించిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతనిథ్యం తగ్గడం అన్యాయం. జనాభా నియంత్రణ కోసం కేంద్రం చెప్పిన సూచనలు పాటించి, పాటుపడిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కేటీఆర్ అన్నారు.