పాట్నా : కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ పర్యటన తర్వాత బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఒక ఆలయాన్ని కడుగుతున్నట్లు ఉన్న వీడియో వివాదానికి దారితీసింది, బిజెపియేతర పార్టీల మద్దతుదారులను “అస్పృశ్యులుగా పరిగణిస్తారా” అని కాంగ్రెస్ ప్రశ్నించింది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం… బీహార్‌లో నిరుద్యోగాన్ని ఎత్తిచూపడం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రారంభించిన ‘వలసలను ఆపండి, ఉద్యోగాలు ఇవ్వండి’ యాత్రలో భాగంగా కన్హయ్యకుమార్ బొంగావ్ గ్రామంలోని దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించినప్పుడు ఈ సంఘటన జరిగింది.
కన్హయ్య కుమార్ ఆలయ ప్రాంగణం నుండి ఒక ప్రసంగం కూడా చేశాడు. వెంటనే, కన్హయ్య సందర్శన తర్వాత కొంతమంది వ్యక్తులు ఆలయాన్ని కడుగుతున్నట్లు కనిపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సంచలనం సృష్టించింది.
కాగా, ఈ విషయంపై కాంగ్రెస్ ప్రతినిధి జ్ఞాన్ రంజన్ గుప్తా ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ… “ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి మద్దతుదారులు మాత్రమే పవిత్రమైన వ్యక్తులా, మిగిలిన వారు అంటరానివారా! ఈ చర్య పరశురాముడి వారసులను అగౌరవపరిచింది. బిజెపియేతర పార్టీలు, మద్దతుదారులను అంటరానివారిగా పరిగణించే కొత్త అల్ట్రా-సంస్కృతీకరణ దశలోకి మనం ప్రవేశించామా?” అని గుప్తా ప్రశ్నించారు. అయితే, బిజెపి ఈ వాదనలను తోసిపుచ్చింది కన్హయ్య పర్యటన తర్వాత ఆలయం కడగడం ప్రజల తిరస్కరణను చూపిస్తుందని పేర్కొంది.
“మొదట, కన్హయ్య కుమార్ సందర్శన తర్వాత ఆలయాన్ని కడిగిన వారి గుర్తింపును మనం ముందుగా ధృవీకరించాలి. కాంగ్రెస్ నాయకుడి సందర్శన తర్వాత ఆలయాన్ని కడిగితే, అది కన్హయ్య కుమార్ బ్రాండ్ రాజకీయాల పట్ల తిరస్కరణను చూపుతుంది” అని బిజెపి ప్రతినిధి అసిత్ నాథ్ తివారీ చెప్పినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.