న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాలని, దానికి అనుకూలంగా ఓటు వేయొద్దని బిజెపి మిత్రపక్షాలు, పార్లమెంటు సభ్యులు సహా అన్ని లౌకిక రాజకీయ పార్టీలకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) విజ్ఞప్తి చేసింది.
పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు, అన్ని లౌకిక పార్టీలు, ఎంపీలు బిల్లును వ్యతిరేకించాలని AIMPLB అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మానీ పిలుపునిచ్చారు. బిల్లును ఓడించడానికి,బిజెపి మతపరమైన ఎజెండాను అడ్డుకోవడానికి తమ ఓట్లను ఉపయోగించాలని ఆయన వారిని కోరారు. ఈ బిల్లు వివక్ష, అన్యాయంపై ఆధారపడి ఉండటమే కాకుండా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26 లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులకు ప్రత్యక్షంగా విరుద్ధంగా ఉందని రెహ్మానీ నొక్కి చెప్పారు.
ఈ బిల్లు ద్వారా బిజెపి వక్ఫ్ చట్టాన్ని బలహీనపరచాలని, ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని నాశనం చేయడానికి అవకాశాన్ని సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రార్థనా స్థలాల చట్టం ఉన్నప్పటికీ, ప్రతి మసీదులో దేవాలయాలను కనుగొనే సమస్య పెరుగుతూనే ఉందని ఆయన ఎత్తి చూపారు. ఈ సవరణ బిల్లు ఆమోదం పొందితే, వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ డిప్యూటీ మేజిస్ట్రేట్లు ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం సులభం అవుతుంది.
వక్ఫ్ బై-యూజర్ రద్దు, పరిమితి కాల మినహాయింపు తొలగింపు, వక్ఫ్ బోర్డు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతర సభ్యులను చేర్చడం, వక్ఫ్ ట్రిబ్యునల్ అధికారాలను తగ్గించడం వంటి ప్రతిపాదిత సవరణలు వక్ఫ్ ఆస్తులకు ఉన్న చట్టపరమైన రక్షణలను తొలగిస్తాయని AIMPLB అధ్యక్షుడు పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తులపై వివాదాల్లో ప్రభుత్వ సంస్థలను (కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, సెమీ-అటానమస్ సంస్థలు) చేర్చడం వల్ల చట్టవిరుద్ధమైన ప్రభుత్వ ఆక్రమణలను చట్టబద్ధం చేస్తారని ఆయన ఎత్తి చూపారు.
దేశంలోని ఇతర మత వర్గాల వక్ఫ్ ఆస్తులకు కూడా ఇవే రక్షణలు ఉన్నాయని, అయినా ముస్లిం వక్ఫ్ ఆస్తులను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వివక్షత, అన్యాయమని ఆయన అన్నారు. భారతదేశపు హిందూ-ముస్లిం సోదరభావం, ఒకరి మతాల పట్ల ఒకరు గౌరవం, ఆచారాలు, పండుగల గురించి ఎంపీలకు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహమానీ గుర్తు చేసారు.
అయితే, ఈ మత సామరస్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న శక్తులు ఇప్పుడు దేశ రాజకీయ దృశ్యాన్ని నియంత్రిస్తున్నాయని, గందరగోళం, అశాంతిని సృష్టించే ఉద్దేశ్యంతో ఉన్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. పార్లమెంటులో బిజెపి మతపరమైన ఎజెండాను ఎంపీలు విజయవంతంగా ఓడించగలరని రెహమానీ ఆశాభావం వ్యక్తం చేశారు.