హైదరాబాద్: ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపాలు, తీసుకురావల్సిన సంస్కరణలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఆచరణీయమైన పాలసీని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి విద్యా కమిషన్‌ను ఆదేశించారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ… క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా, ఆచరణ సాధ్యంగా పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు ప్రారంభించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వీటిలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు, అమ్మ ఆదర్శ కమిటీలను తిరిగి ఏర్పాటు చేయడం, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లను సకాలంలో పంపిణీ చేయడం,యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు ఇందులో భాగంగా ఉన్నాయని సీఎం అన్నారు. అంతేకాదు
విద్యా అభ్యాసం, ఉపాధి సామర్థ్యం మధ్య అంతరాన్ని తగ్గించడానికి యంగ్ ఇండియా స్కిల్ విశ్వవిద్యాలయాలను నిర్మించాలని రాష్ట్రం యోచిస్తోందన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రారంభ దశలో అందించే విద్య ప్రధానమని, దీనికోసం అంగన్‌వాడీ ప్రాథమిక పాఠశాల స్థాయిలలో అవసరమైన సంస్కరణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. ఈ మేరకు తీసుకోరావాల్సిన మార్పులపై సామాజికవేత్తలు, వివిధ సంఘాల నిపుణులతో చర్చించి మెరుగైన విధానపత్రం రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో, విద్యా కమిషన్ చైర్మన్ ఎం మురళి క్షేత్ర పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు, విదేశాల్లో ఉన్న నమూనాలను ఆయన ప్రదర్శంచారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ… గతంలో తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు విద్యార్థులలో సృజనాత్మకతను ఎలా తగ్గించాయో విశ్లేషణాత్మకంగా వివరించారు. విద్యావ్యవస్థలో మార్పుల నిమిత్తం పరీక్షా విధానాన్ని మార్చాలని, తరచుగా పాఠశాల తనిఖీలు, విద్యార్థుల్లో జీవన నైపుణ్యానికి తీసుకోవాల్సిన చర్యలను ఆయన ప్రతిపాదించారు.