గాజా నగరం: ఇజ్రాయెల్ బాంబుదాడులతో గాజా ఉక్కిరిబిక్కిరవుతోంది. దాడులు ఇలాగే కొనసాగితే అక్కడ ఉన్న బందీలకు “చాలా ప్రమాదకరమైన” పరిస్థితిని సృష్టిస్తోందని హమాస్ తెలిపింది. జీవించి ఉన్న బందీలలో సగం మంది సైన్యం ఉన్న ప్రాంతాలలో ఉన్నారని మిలిటెంట్ సంస్థ ప్రతినిధి హెచ్చరించారు.
“జీవించి ఉన్న ఇజ్రాయెల్ (బందీలు)లో సగం మంది… ఇజ్రాయెల్ సైన్యం ఇటీవలి రోజుల్లో ఖాళీ చేయమని కోరిన ప్రాంతాలలోనే ఉన్నారు” అని హమాస్ సాయుధ విభాగం ప్రతినిధి అబు ఒబెదా ఒక ప్రకటనలో తెలిపారు. “వీరిని (బందీలను) బదిలీ చేయకూడదని మేము నిర్ణయించుకున్నాము… కానీ (ఈ పరిస్థితి) వారి ప్రాణాలకు అత్యంత ప్రమాదకరమని ఆయన అన్నారు.”
ఇదిలా ఉండగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగపడుతూనే ఉంది. గాజాలోని దక్షిణ ప్రాంత ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ బలగాలు శుక్రవారం జరిపిన దాడిలో 17 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం స్థానికులు గాలిస్తున్నారు. హమాస్‌ను కట్టడి చేసేందుకు మరో సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేయాలని నెతన్యాహూ ప్రభుత్వం పథక రచన చేసింది. ఇందులో భాగంగా పాలస్తీనియన్లను నివాసాలు వదిలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.
పాలస్తీనా ప్రజలు భయభ్రాంతులకు గురిచేసేలా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. అక్కడే ఉన్నవారిని వెళ్లగొట్టేందుకు ఇజ్రాయెల్ బలగాలు శుక్రవారం ఆ ప్రాంతంలోకి ప్రవేశించాయి. గాజాలోని వేర్వేరు ప్రాంతాలపై గురువారం ఇజ్రాయెల్ చేపట్టిన భారీ వైమానిక దాడుల్లో 14 మంది చిన్నారులు కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పేర్కొంది.