గౌహతి: మణిపూర్‌లోని చురచంద్‌పూర్ జిల్లా న్యూ జోవెంగ్ గ్రామంలో రేబిస్ వ్యాధి భారీగా ప్రబలింది. దీంతో అధికారులు ఆంక్షలు విధించి, కంటైన్‌మెంట్ జోన్‌లను ప్రకటించారు. ఈ గ్రామంలో గత వారం నుండి రేబిస్ కేసులు వెలుగులోకి రావడం ప్రారంభించాయి.
ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటిదాకా 749 మందిని కుక్కలు కరిచాయి. ఈ కారణంగా ముగ్గురు చనిపోయినట్టు అధికారిక వర్గాల ప్రకటించాయి. న్యూ జౌవెంగ్ గ్రామంలో ఇప్పుడు పెద్దసంఖ్యలో అనుమానిత రేబిస్ కేసులు నమోదయ్యాయి, ఇది ప్రజలు, జంతువుల ఆరోగ్యం,భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోందని వర్గాలు తెలిపాయి.
“పెంపుడు జంతువులు/కుక్కలను గ్రామం వెలుపలకు తరలించడాన్ని” జిల్లా మేజిస్ట్రేట్ ధరుణ్ కుమార్ ఖచ్చితంగా నిషేధించారు. గ్రామంలోని అన్ని పెంపుడు, వీధి కుక్కలను గుర్తించి టీకాలు వేయాలని కూడా ఆయన ఆదేశించారు.
ఇంటింటికీ పర్యవేక్షణ, ఆరోగ్య తనిఖీలు నిర్వహించనున్నారు. నియంత్రణ కాలంలో పెంపుడు కుక్కల అమ్మకం, రవాణా ఖచ్చితంగా నిషేధం విధించామని ఆయన అన్నారు. ఈ ఉత్తర్వును ఉల్లంఘించిన ఎవరైనా శిక్షార్హులని ఉత్తర్వులో పేర్కొన్నారు.
పశువైద్య శాఖ ఏర్పాటు చేసిన త్వరిత ప్రతిస్పందన బృందాలు న్యూ జౌవెంగ్ గ్రామంలో సర్వేలు నిర్వహించాయి. ఈ డ్రైవ్ సమయంలో, దాదాపు 30 ఇళ్లను సర్వే చేశారు. సర్వే బృందాలు ఆ ఇళ్ల యాజమాన్యంలోని అన్ని కుక్కలకు టీకాలు వేసి, వాటికి సర్టిఫికెట్లు అందించాయి.
ఈ మేరకు జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ వీథియెన్నెంగ్ మాట్లాడుతూ… వ్యాక్సిన్ తగినంతగా సరఫరా చేయకపోవడమే ఈ వ్యాప్తిని ఎదుర్కోవడంలో అతిపెద్ద సవాలు అని అన్నారు. రేబిస్ వ్యాధి ఏటా ప్రపంచవ్యాప్తంగా 60,000 మందికి పైగా ప్రాణాలను బలిగొంటుంది, ఆ మరణాలలో దాదాపు 36 శాతం భారతదేశంలోనే సంభవిస్తుందని UNDP (యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్) తెలిపింది.