యాద్గిర్, కర్ణాటక: కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలోని జాలిబెంచి అనే కుగ్రామంలో విద్యుత్తు అంతరాయం కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నిన్న అర్థరాత్రి జరిగిన ఈ సంఘటనలో దాదాపు వంద ఇళ్లు ప్రభావితమయ్యాయి. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఇళ్లలోని ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు కాలిపోయాయి. పలువురు స్థానికులు గాయపడ్డారు.
ఈ భయంకరమైన సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అయ్యాయి, విద్యుత్ స్తంభాల నుండి నిప్పురవ్వలు రాలడంతో…దగ్గరలో ఉన్న ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. ఊరంతా దట్టమైన పొగ అలుముకుంది. ఇళ్ల లోపలి భాగం కాలిపోవడం వంటి భయానక దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. ప్రభావిత ఇళ్ల లోపలి నుండి వచ్చిన ఫుటేజ్‌లు గణనీయమైన నష్టాన్ని చూపిస్తున్నాయి – కాలిపోయిన స్విచ్‌బోర్డులు, కాలిపోయిన బ్యాటరీలు, నల్లబడిన ఫ్యాన్ బ్లేడ్‌లు,టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు ధ్వంసమైన చిత్రాలు మనకు కనిపించాయి.
ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఊరంతా మంటలు చెలరేగడంతో అత్యవసర సేవలు త్వరగా స్పందించాయి. మంటలు మిగతా ప్రాంతాలకు విస్తరించకుండా అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రాంతంలో వీచిన ఆకస్మిక గాలుల వల్ల ఈ సంఘటన జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ బలమైన గాలుల కారణంగా పాత విద్యుత్ తీగలు ఒకదానికొకటి తాకడం వల్ల షార్ట్ సర్క్యూట్లు సంభవించి, తరువాత మంటలు చెలరేగి ఉండవచ్చు. అయితే, ఖచ్చితమైన కారణం ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు.
ప్రాంతీయ విద్యుత్ సంస్థ అయిన గుల్బర్గా విద్యుత్ సరఫరా సంస్థ (GESCOM) అధికారులు గ్రామాన్ని సందర్శించారు. ప్రస్తుతం పునరుద్ధరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి, దెబ్బతిన్న లైన్లను మరమ్మతు చేయడానికి, ప్రభావిత ఇళ్లకు విద్యుత్తును పునరుద్ధరించడానికి బృందాలు పనిచేస్తున్నాయి. జాలిబెంచి గ్రామంలోని కరెంట్ లైను పాతబడిపోయిందని, కొన్ని విద్యుత్ లైన్లు అనేక దశాబ్దాల నాటివని స్థానికులు ఆరోపిస్తున్నారు.