హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో చట్టపరమైన స్పష్టత, పారదర్శకతను తీసుకురావడం లక్ష్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం హౌసింగ్ రిక్వైర్‌మెంట్స్ కస్టమైజ్డ్ సొల్యూషన్స్– HRCS ఇండియా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
హైదరాబాద్‌లోని ఆస్తి కొనుగోలుదారులు, విక్రేతలు, వాటాదారులకు చట్టపరమైన, రుణ సంబంధిత సమాచారాన్ని ఉచితంగా అందిస్తుంది. RERA-సర్టిఫైడ్ సంస్థ HRCS ఇండియా ద్వారా ఏర్పాటైన ఈ వెబ్‌సైట్… మనం కొనుగోలు చేసిన ఆస్తులు.. FTL పరిథిలో ఉన్నాయా లేదా బఫర్ జోన్‌లలోకి వస్తాయో లేదో నిర్ణయించడంలో వినియోగదారులకు సహాయపడుతుంది.
ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ…పర్యావరణ హితమైన నగరాభివృద్ధికి హైడ్రా దిక్సూచి అవుతుందని అన్నారు. చెరువులు, పార్కులు, నాలాలు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జా కాకుండా పరిరక్షేందుకు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు.
“ప్రారంభంలో, HYDRA చట్టబద్ధతపై సందేహాలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత అన్ని అనుమానాలు పటాపంచలయ్యాయన్నారు. వినియోగదారులకు, బ్యాంకులకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుసంధనకర్తగా వ్యవహరించే సంస్థ హైడ్రా అని కమిషనర్ రంగనాథ్ అన్నారు. “ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తులు చట్టవిరుద్ధంగా సర్వే నంబర్లను మారుస్తున్నారు, ప్రైవేట్ లేఅవుట్ అనుమతులను ఉపయోగించి ప్రభుత్వ భూములలో ఇళ్లను నిర్మిస్తున్నారు. వాటిని విక్రయిస్తున్నారు. అందువల్ల, కొనుగోలు చేసే ముందు అన్ని వివరాలను పూర్తిగా ధృవీకరించుకోవడం చాలా అవసరం” అని కమిషనర్ నొక్కి చెప్పారు.
హైడ్రా రావడంతో ప్రజలందరికీ చెరువుల హద్దులు తెలిసాయి. FTL, బఫర్ జోన్లు గురించి చర్చించుకుంటున్నారు. త్వరలోనే నగరంలోని చెరువుల హద్దులు, ప్రభుత్వ భూముల వివరాలు ప్రజలందరికీ అందుబాటులో హైడ్రా ఉంచుతోంది. చెరువులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ముందుగా ఆరు చెరువుల అభివృద్ధి పనులు ప్రారంభించాం. వచ్చే వర్షాకాలానికి ఇవి సిద్ధమవుతాయని హైడ్రా కమిషనర్ అన్నారు.
డ్రైనేజీ వ్యవస్థలకు మెరుగుదలతో పాటు హైదరాబాద్ నగరంలో వరదల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన అన్నారు.. రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనాన్ని ప్రస్తావిస్తూ రంగనాథ్ మాట్లాడుతూ, “నగరంలో ఇప్పటికే దాదాపు 3,00,000 ఫ్లాట్లు, ఇళ్ళు నిర్మించారు. అవి ఇంకా అమ్ముడుపోలేదు. అయితే,తొందరలోనే కోలుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. పారదర్శకమైన, మోసాలు లేని రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన నొక్కిచెప్పారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం 2008లో కూడా మందగించింది అని… అందరికీ అందుబాటు ధరల్లో ఫ్లాట్లు ఉంటే వ్యాపారం పుంజుకుంటుంది అని’’ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. ఇలాంటి తరుణంలో HRCS INDIA సంస్థ వినియోగదారుడికి తోడుగా ఉండి మోసాలకు ఆస్కారం లేకుండా బ్యాంక్ ల వారితో సరైన ప్రాజెక్టులకు లోన్లు వచ్చేలా చూడడం ఆహ్వానించదగ్గ విషయం అని అన్నారు.