జెనీవా: పాలస్తీనా నిరాశ్రయుల దుస్థితిని చూసి చలించిన రెడ్ క్రాస్ అధ్యక్షుడు గాజాను “భూమిపై నరకం”గా అభివర్ణించారు. రెండు వారాల్లోగా తమ ఫీల్డ్ హాస్పిటల్లో సరఫరాలు అయిపోతాయని హెచ్చరించారు.
గాజాను”భూతల నరకం అని వర్ణించాల్సిన పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాము… చాలా ప్రాంతాల్లో ప్రజలకు నీరు, విద్యుత్, ఆహారం అందుబాటులో లేవు” అని మిర్జానా స్పోల్జారిక్ జెనీవాలోని అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో రాయిటర్స్‌తో అన్నారు.
మార్చి 2న ఇజ్రాయెల్ సహాయ ట్రక్కుల ప్రవేశాన్ని నిరోధించినప్పటి నుండి పాలస్తీనా ప్రాంతంలోకి కొత్తగా ఎలాంటి సహాయ సామాగ్రి ప్రవేశించలేదు. ఇప్పుడు కాల్పుల విరమణ తదుపరి దశపై చర్చలు నిలిచిపోయాయి. మార్చి 18న ఇజ్రాయెల్ తన సైనిక దాడిని తిరిగి ప్రారంభించింది.
యుద్ధ విరమణ జరిగిన 42 రోజుల్లో 25,000 సహాయ ట్రక్కులు గాజాలోకి ప్రవేశించాయని, హమాస్ తన యుద్ధ యంత్రాన్ని పునర్నిర్మించడానికి సహాయాన్ని ఉపయోగించిందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది, ఈ ఆరోపణను ఆ బృందం ఖండించింది.
స్పోల్జారిక్ మాట్లాడుతూ, సరఫరాలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. “ఆరు వారాలుగా, ఏమీ రాలేదు, కాబట్టి రెండు వారాలలో, ఆసుపత్రిని కొనసాగించడానికి అవసరమైన సామాగ్రి అయిపోతుంది” అని ఆమె అన్నారు.
యాంటీబయాటిక్స్, బ్లడ్ బ్యాగ్‌ల సరఫరా వేగంగా తగ్గిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ ఎన్‌క్లేవ్‌లోని 36 ఆసుపత్రులలో ఇరవై రెండు ఆసుపత్రులు కనీస స్థాయిలో మాత్రమే పనిచేస్తున్నాయని డాక్టర్ రిక్ పీపర్‌కార్న్ జెరూసలేంలో వీడియో లింక్ ద్వారా జెనీవాలో విలేకరులతో అన్నారు.
మానవతా కార్యకలాపాల భద్రత గురించి రెడ్‌క్రాస్ అధ్యక్షుడు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. “జనాభా తరలివెళ్లడం చాలా ప్రమాదకరం, కానీ మేము పనిచేయడం కూడా చాలా ప్రమాదకరం” అని స్పోల్జారిక్ అన్నారు.
మార్చిలో, పాలస్తీనా రెడ్ క్రెసెంట్‌కు చెందిన ఎనిమిది మంది సభ్యులతో సహా 15 మంది అత్యవసర, సహాయ కార్మికుల మృతదేహాలు దక్షిణ గాజాలోని ఒక సామూహిక సమాధిలో ఖననం చేసినట్లు కనుగొన్న విషయం తెలిసిందే.ఇజ్రాయెల్ దళాలు వారిని చంపాయని UN, రెడ్ క్రెసెంట్ ఆరోపించాయి.
మరోవంక ఇజ్రాయెల్ సైన్యం ప్రతినిధి మాట్లాడుతూ, సమీపంలో ఆరుగురు హమాస్ ఉగ్రవాదులను గుర్తించామని ప్రాథమిక దర్యాప్తులో ఈ సంఘటన “ముప్పు భావన కారణంగా” జరిగిందని తేలింది.
హమాస్ ఆధీనంలో ఉన్న మిగిలిన బందీలను విడుదల చేయడానికి, గాజాలో తీవ్రమైన మానవతా సమస్యలను పరిష్కరించడానికి స్పోల్జారిక్ తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు.
ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం, హమాస్ నేతృత్వంలోని ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడిలో 1,200 మందిని చంపి 250 మంది బందీలను తీసుకున్న తర్వాత ఇజ్రాయెల్ 2023 అక్టోబర్‌లో గాజాలో తన సైనిక చర్యను ప్రారంభించింది. అప్పటి నుండి, 50,800 మందికి పైగా పాలస్తీనియన్లు చంపేశారు. గాజా భూభాగంలో ఎక్కువ భాగం శిథిలావస్థకు చేరుకుంది.