న్యూయార్క్ : జనవరి కాల్పుల విరమణ ఒప్పందం రద్దయినప్పటినుంచి గాజా స్ట్రిప్‌లో దాదాపు నాలుగులక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేస్తున్న యూఎన్ ఏజెన్సీ (UNRWA) సామాజిక మాథ్యమం Xలో హెచ్చరించింది.
“యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి పాలస్తీనియన్లు ఇప్పుడు సహాయ సామాగ్రిని అందుకోవడంలో అతి ఎక్కువ రోజులు అంతరాయాన్ని ఎదుర్కొంటున్నారు” అని యూఎన్ ఏజెన్సీ తన సోషల్‌మీడియా ఖాతోలో పేర్కొంది. ఈ దుస్థితిని నివారించడానికి హమాస్, ఇజ్రాయెల్ మధ్య సంధిని తిరిగి ప్రారంభించాలని UNRWA తన అత్యవసర పిలుపును పునరుద్ఘాటించింది.
“#Ceasefire Now పునరుద్ధరణకు, గాజాలోని బందీలందరినీ గౌరవప్రదంగా విడుదల చేయడానికి, మానవతా సహాయం, వాణిజ్య సామాగ్రికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలని మేము పిలుపునిచ్చాము” అని UNRWA తెలిపింది.
జనవరిలో జరిగిన కాల్పుల విరమణ, ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇజ్రాయెల్ సైన్యం మార్చి 18న గాజాపై తన దాడిని పునరుద్ధరించింది. 2023 అక్టోబర్ నుండి గాజాలో ఇజ్రాయెల్ దాడిలో 50,800 మందికి పైగా పాలస్తీనియన్లు, వారిలో ఎక్కువ మంది మహిళలు మరియు పిల్లలు మరణించారు.