అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ యూనిట్‌లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ఎనిమిది మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, కలెక్టర్, ఎస్పీలతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. బాధితుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కోటవురట్ల మండల కేంద్రానికి 3 కి.మీల దూరంలో ఈ విషాదం చోటుచేసుకుంది. తారాజువ్వల తయారీకి పేరొందిన ఈ కర్మాగారంలో బాణసంచా తయారు చేస్తున్న సమయంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి షెడ్‌లు కూలిపోయాయి, దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. క్షతగాత్రుల్లో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు సమయంలో పరిశ్రమలో 15మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం .
కాగా, హోంమంత్రి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తో కలిసి సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల పరిహారం ప్రకటించారు. అనకాపల్లి జిల్లాలో జరిగిన విషాదకర పేలుడు ఘటనపై అటు ప్రధాని మోదీ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరంగా, పీఎం సహాయనిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోం మంత్రి అనితను, జిల్లా అధికారులకు సూచించారు. కాగా, ఘటనపై కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు.