జెరూసలేం: పాలస్తీనా దేశాన్ని గుర్తించాలనే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ ప్రణాళికలపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు విరుచుకుపడ్డారు. “మా దేశం మధ్యలో పాలస్తీనా రాజ్యం అనే ఆలోచనను ప్రోత్సహించడంలో అధ్యక్షుడు మాక్రాన్ వైఖరిని ఇజ్రాయెల్ ప్రధాని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఈ వారం ప్రారంభంలో మాక్రాన్ చేసిన వ్యాఖ్యలను నెతన్యాహు ప్రస్తావించారు.
“వాస్తవికతను కాదని, కేవలం ఊహాగానాల ఆధారంగా మేము మా ఉనికికి ప్రమాదంలో నెట్టము. ఇజ్రాయెల్ ఉనికికి ప్రమాదం కలిగించే పాలస్తీనా రాజ్య స్థాపన గురించి నైతిక ప్రసంగాలను మేము అంగీకరించము – ముఖ్యంగా ఫ్రాన్స్‌లోని కోర్సికా, న్యూ కాలెడోనియా, ఫ్రెంచ్ గయానా, ఇతర భూభాగాలకు స్వాతంత్ర్యం ఇవ్వడాన్ని వ్యతిరేకించే వారి నుండి కాదు, వారి స్వాతంత్ర్యం ఫ్రాన్స్‌కు ఎటువంటి ముప్పు కలిగించదని” ఇజ్రాయెల్ ప్రధాని అన్నారు.
ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కుమారుడు యైర్ నెతన్యాహు సైతం మాక్రాన్ సోషల్ మీడియా ప్రకటనకు ప్రతిస్పందనగా ఫ్రెంచ్ విధానంపై ఒక అసభ్యకరమైన వ్యాఖ్యను పోస్ట్ చేయడం ద్వారా దానిని మరింత వివాదాస్పదం చేశాడు.
కాగా, వచ్చే జూన్‌లో ఫ్రాన్స్ పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు మాక్రాన్ అన్నారు, పాలస్తీనియన్ల చట్టబద్ధమైన హక్కుకు, శాంతికి తమ దేశం మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. శనివారం ఆయన ఫ్రెంచ్ వైఖరిని పునరుద్ఘాటించారు. దీనిపై యైర్ నెతన్యాహు మాక్రాన్‌పై విరుచుకుపడ్డాడు.
పాలస్తీనాను గుర్తించాలనే ఫ్రాన్స్ ప్రణాళికను ఇజ్రాయెల్ ఖండించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ మాట్లాడుతూ… పాలస్తీనా ఒక కల్పిత రాజ్యమని, దానికి ఏదైనా గుర్తింపు ఇవ్వడం అంటే “ఉగ్రవాదానికి ప్రతిఫలం” అని పేర్కొన్నారు.
కాగా, పారిస్… పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తించడం ఒక ప్రధాన విధాన మార్పును సూచిస్తుంది. మరోవంక పాలస్తీనాను గుర్తించిన అత్యంత బలమైన యూరోపియన్ దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి అవుతుంది, ఈ చర్యను యునైటెడ్ స్టేట్స్ కూడా చాలా కాలంగా వ్యతిరేకించింది. మాక్రాన్ ప్రకటనను హమాస్ స్వాగతించింది.