కోల్‌కత : నాలుగు రోజుల క్రితం ఏప్రిల్ 11న ముర్షిదాబాద్‌లోని జాంగిపూర్ ప్రాంతంలో హింసాత్మక మూక దాడి తరువాత, బెడ్‌బునా గ్రామవాసుల ఇళ్లను తగలబెట్టారు. ఫలితంగా వారి జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయి. సమీప ప్రాంతంలో వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా, బయటి వ్యక్తుల గుంపు గ్రామంపై దాడికి పాల్పడ్డారు, 120 ఇళ్లను తగలబెట్టి, నగదు, నగలు,పశువులు వంటి విలువైన వస్తువులను దోచుకెళ్లారు.
ఆ భయానక సంఘటనను గుర్తుచేసుకుంటూ, బాధితుల్లో ఒకరైన రాహుల్ మండల్, “ఆయుధాలు రాళ్లను తీసుకుని, వారు మా ఇంటిపై పెట్రోల్ పోయడం ప్రారంభించారు. వారు నిప్పంటించగా మేము వెనుక తలుపు ద్వారా పారిపోయాము” అని అన్నారు. దాడి చేసినవారు తమ వస్తువులను దోచుకోవడమే కాకుండా వారి పశువులను కూడా ఎలా తీసుకెళ్లారో ఆయన వివరిస్తున్నపుడు బాధితుడి ముఖంలో ఆ భయాందోళన ప్రతిబింబించింది.
మూకదాడి తర్వాత తమ ఇళ్ళు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలుసుకుని మరో నివాసి నీలిమా తమ బాధను పంచుకున్నారు. దుండగుల దెబ్బకు భయపడి”మేము కొంత దూరంలో దాక్కున్నాము. మేము తిరిగి వచ్చేసరికి, ఇళ్ళు, వస్తువులు, అన్నీ బూడిదగా మారాయని” ఆమె చెప్పింది. దట్టమైన పొగ తమ గ్రామాన్ని ముంచెత్తడంతో మహిళలు, పిల్లలు సహా 100 కి పైగా కుటుంబాలు భయంతో పారిపోయాయి.
పోలీసుల ప్రతిస్పందన ఆలస్యం కావడం పట్ల తపన్ నస్కర్ నిరాశ వ్యక్తం చేశారు. “మేము వెంటనే వారికి ఫోన్ చేసాము, కానీ వారు దాదాపు రెండు గంటల తర్వాత వచ్చారు” అని ఆయన అన్నారు. ఇప్పుడు నిరాశ్రయులైన చాలా మంది గ్రామస్తులు మాల్డా జిల్లాలోని భాగీరథి నదికి అవతల లేదా పొరుగున ఉన్న జార్ఖండ్‌లోని బంధువుల వద్ద ఆశ్రయం పొందారు.
ప్రస్తుతం బంధువులతో ఉంటున్న శాంతి, “మేము సంవత్సరాలుగా ఇతర వర్గాల సభ్యులతో శాంతియుతంగా జీవిస్తున్నాము. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటిది జరగలేదు” అని అన్నారు. ఆమె మాటలు మొత్తం గ్రామ ప్రజల లోతైన భావాన్ని ప్రతిబింబించాయి.
సర్వస్వం కోల్పోయిన ఆ గ్రామ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం స్నేహ హస్తం అందించింది. ఇళ్ల పునర్నిర్మాణ పనులకు నిధులు సమకూరుస్తామని భరోసా ఇచ్చింది. ఈమేరకు వారంలోపు సహాయ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఒక జిల్లా అధికారి ధృవీకరించారు. బాధిత కుటుంబాలు ఇంటికి తిరిగి రావడానికి సహాయం చేయడానికి “యుద్ధ ప్రాతిపదికన” పనిచేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
మరోవంక, అదే జిల్లాలో అల్లర్లకు గురైన మరో ప్రాంతమైన ధులియన్ కూడా హింసతో విలవిలలాడుతోంది. స్థానిక ఫార్మసిస్ట్ అయిన రాజేష్ మూడు రోజుల తర్వాత తన దుకాణాన్ని తిరిగి తెరిచాడు. “స్థానిక అధికారులు, BSF గస్తీ ద్వారా నాకు ధైర్యం లభించింది. ఇదే నా ఏకైక ఆదాయ వనరు” అని అతను చెప్పాడు. ఐదు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న అతను, తన సమాజంలో ఇటువంటి హింస చెలరేగుతుందని ఎప్పుడూ ఊహించలేదని వాపోయాడు.
“హిందువులు, ముస్లింల దుకాణాలు, ఇళ్ళపై దాడి జరిగిందని మూకదాడిలో తన దుకాణాన్ని కోల్పోయిన ఎండి అక్బర్ ఆవేదనతో వెల్లడించాడు. వీరు నిరసనకారులు కాదు – వారు నేరస్థులు” అని అన్నారు. వర్గాల మధ్య చాలా కాలంగా ఉన్న సామరస్యాన్ని ఆయన నొక్కిచెప్పారు. అశాంతికి కారణంగా బయటి వ్యక్తులే అని ఆయన నిందించారు. “మేము అందరికీ శాంతి,భద్రతను కోరుకుంటున్నాము” అని ఆయన తెలిపారు.
గ్రామవాసుల కష్టాలకు తోడు, నెట్ సేవలు నిలిపివేశారు. ATMలు ఖాళీగా ఉన్నాయి. “నగదు లేదు. నేను డిజిటల్ చెల్లింపులు చేయలేను” అని ధులియన్ నివాసి పంకజ్ సర్కార్ అన్నారు. “మా పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదని ఆయన అన్నారు.”
జిల్లా అధికారులు, భద్రతా దళాల మొహరింపుతో ఆ గ్రామంలో నెమ్మదిగా సాధారణ స్థితి నెలకొంటోంది. ప్రభావిత సమాజాలు న్యాయం, మద్దతు, అన్నింటికంటే ముఖ్యంగా శాంతి పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తున్నాయి.