హైదరాబాద్: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీచేసింది. ఈమేరకు షెడ్యూల్డ్ కులాల (రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ) చట్టం 2025ను ఆమోదించడంతో, రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగ నోటిఫికేషన్‌లను జారీ చేయడానికి మార్గం సుగమం అయింది. అబిజ్ఞ వర్గాల సమాచారం మేరకు ఈ నెలాఖరు నాటికి వివిధ విభాగాల్లో 20,000 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌లను జారీ చేయాలని యోచిస్తోంది.
2024-25 సంవత్సరానికి ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉద్యోగ క్యాలెండర్‌ను జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణ/ఉప-వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, తెలంగాణ అసెంబ్లీలో ఆ మేరకు చట్టం ఆమోదించే వరకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్‌లను జారీ చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
గత నెల తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఈ చట్టాన్ని ఆమోదించారు, ఆ తర్వాత గవర్నర్ ఆమోదం కూడా పొందడంతో, ఇది ఏప్రిల్ 14 నుండి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఉన్నతాధికారులు త్వరలో ఎన్ని ఖాళీలను భర్తీ చేయాలో,ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలో అంచనా వేస్తారు. ఈమేరకు సుప్రీం కోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC), ఆరోగ్య శాఖలో దాదాపు 10,000 ఖాళీలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో, ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్‌లు, ఇతరులు సహా దాదాపు 5,000 పోస్టులు ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. అదనంగా, ఇంజనీరింగ్‌లో దాదాపు 2,000 నుండి 3,000 ఖాళీలు ఉన్నాయి.
అంతేకాదు గ్రూప్-1, గ్రూప్-4 కేటగిరీలలోని పోస్టులను గుర్తించడానికి, అలాగే పోలీసు శాఖలో కూడా ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. గురుకుల, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా గణనీయమైన సంఖ్యలో ఖాళీలు గుర్తించారు. వీటిని భర్తీ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.