న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసును తదుపరి విచారణకు వచ్చే వారానికి ఢిల్లీ కోర్టు వాయిదా వేసింది.
ఆర్థిక నేరాల సంస్థ ఏప్రిల్ 9న చార్జిషీట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ విదేశీ విభాగం చీఫ్ సామ్ పిట్రోడాతో పాటు సుమన్ దూబేను కూడా నిందితులుగా చేర్చిందని పిటిఐ నివేదించింది. ఈమేరకు శాసనసభ్యులపై కేసుల కోసం ఏర్పాటైన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విశాల్ గోగ్నే నిన్న మాట్లాడుతూ, ఈ విషయాన్ని ఏప్రిల్ 25న “విచారణ కోణంలో” పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మంగళవారం మాట్లాడుతూ, ఈ చార్జిషీట్ “ప్రధాని, హోంమంత్రి ప్రతీకార రాజకీయాలు, బెదిరింపులకు పాల్పడటం తప్ప మరొకటి కాదు” అని అన్నారు. ఈ కేసులతో కాంగ్రెస్ పార్టీని, దాని నాయకత్వాన్ని మౌనంగా ఉంచలేరని, సత్యమేవ జయతే,” అని ఆయన Xలో ట్వీట్ చేశారు.
బీజేపీ ప్రతీకార రాజకీయాలకు వ్యతిరేకంగా ED కార్యాలయాల ముందు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పార్టీ కార్యకర్తలతో “దేశవ్యాప్త నిరసనలు” నిర్వహిస్తామని ప్రకటించారు.
అహ్మదాబాద్‌లో ఏఐసీసీ రెండు రోజుల సమావేశాన్ని ముగించిన రోజున ED ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. కాంగ్రెస్‌ను తిరిగి బలోపేతం చేయడానికి, బిజెపిపై ప్రజా వ్యతిరేక చర్యలపై దూకుడుగా వ్యవహరించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
కాగా, నేషనల్ హెరాల్డ్ మాజీ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించిన ఆంగ్ల వార్తాపత్రిక, ఇది అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) అనే సంస్థతో కలిసి ఉందని, స్వాతంత్య్రానంతరం, నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంలో ప్రముఖ పాత్ర పోషించిందని ద వైర్ ఆంగ్ల పత్రిక పేర్కొంది.
ఢిల్లీ, ముంబై, లక్నోలలో “AJL మనీలాండరింగ్ కేసులో” తాను జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా శనివారం ED నోటీసులు జారీ చేసినట్లు ప్రకటించింది.
ముంబైలోని హెరాల్డ్ హౌస్ భవనంలోని ఏడవ, ఎనిమిదవ, తొమ్మిదవ అంతస్తులను ఆక్రమించిన జిందాల్ సౌత్ వెస్ట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు కూడా నోటీసులు జారీ చేసింది, దాని నెలవారీ అద్దెను EDకి బదిలీ చేయాలని కోరింది.
నవంబర్ 1, 2012న, బిజెపి నాయకుడు సుబ్రమణియన్ స్వామి నేషనల్ హెరాల్డ్‌ను ప్రచురించిన కంపెనీని కొనుగోలు చేయడానికి గాంధీ కుటుంబం పార్టీ నిధులను ఉపయోగించారని ఆరోపిస్తూ కేసు దాఖలు చేశారు. ఢిల్లీలోని ట్రయల్ కోర్టులో తన ఫిర్యాదులో, గాంధీ కుటుంబం మోసం చేసి వేల కోట్ల విలువైన భూమిని కబ్జా చేసిందని ఆయన అన్నారు.
గాంధీ కుటుంబం “ఢిల్లీ, ఉత్తరప్రదేశ్,ఇతర ప్రదేశాలలో రూ. 1,600 కోట్ల విలువైన AJL ఆస్తులను… ప్రైవేట్ కంపెనీ యంగ్ ఇండియన్ లిమిటెడ్ ద్వారా మోసపూరితంగా సంపాదించారని” ఆయన పేర్కొన్నారు.
యంగ్ ఇండియన్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలను విచారించడానికి ED 2021లో PMLA కింద కేసు నమోదు చేసింది. స్వామి ఫిర్యాదు ఆధారంగా యంగ్ ఇండియన్‌పై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తును ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకున్న ఫలితంగా ఇది జరిగింది.
“సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ లేదా మరెవరికీ ఈ ఆస్తి స్వంతం కాదు. నా ఉద్దేశ్యం, వాటాదారులు కంపెనీకి విరుద్ధంగా ఆస్తులను కలిగి ఉండకూడదని చట్టంలో పేర్కొన్నారు. “సరే మేం చేసిన నేరం ఏమిటి? … మీరు కాంగ్రెస్ పార్టీని స్తంభింపజేయాలనుకుంటున్నారు, మమ్మల్ని ఎలాంటి కార్యాకలాపాలు చేపట్టనీయకుండా పార్టీ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు … ఇది ప్రజాస్వామ్యంపై దాడి” అని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు.