హైదరాబాద్: ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉండనున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా (స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్) ప్రకటించింది. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారాన్ని అందజేస్తామని వెల్లడించింది.
కాగా, గతంలో వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియాను మాత్రమే అందించేవారు. అయితే, ఇప్పుడు రాష్ట్ర విపత్తు సహాయ నిధి కింద ఆ మొత్తాన్ని రూ.50 వేల నుంచి రూ.4 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది..
వేడి నుండి ఉపశమనం
తెలంగాణ ప్రభుత్వం వడదెబ్బ బాధితులకు పరిహారం అందించాలని నిర్ణయించినవేళ, భారత వాతావరణ శాఖ (IMD) ఏప్రిల్ 17 వరకు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు తుఫానులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో రాష్ట్ర ప్రజలు తీవ్రమైన వేసవి వేడి నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఏప్రిల్ 17 వరకు రాష్ట్రానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను కూడా జారీ చేసింది.
తెలంగాణలో వడగాల్పులు
వడదెబ్బ అనేది అధిక ఉష్ణోగ్రతలకు లేదా వేడి వాతావరణంలో ఎక్కువసేపు శారీరక శ్రమ చేయడం వల్ల శరీరం వేడెక్కుతుంది, తద్వారా ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుంది.
శరీర ఉష్ణోగ్రత నియంత్రణ కాకపోతే మనిషి వడదెబ్బ బారిన పడతాడు. దీనిక తక్షణ వైద్య సహాయం అవసరం. లేకపోతే ఇది శరీరంలోని ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కూడా కావచ్చు.
ఈ నేపథ్యంలో వడగాల్పుల ప్రభావం నుంచి రక్షించుకోవడానికి స్థానిక అధికారులు జారీ చేసే ఆరోగ్య సూచనలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎండలో ఎక్కువ సమయం గడపకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. వడదెబ్బ ప్రభావం గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి, సంబంధిత ఆరోగ్య శాఖలు, విపత్తు నిర్వహణ సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నాయి. గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు ఈ అవగాహన చర్యలు కొనసాగనున్నాయి. ఈ చర్యల ద్వారా ఎండల కారణంగా ప్రాణ నష్టాన్ని నివారించడమే కాక, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగనుంది.