న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో 11 ఏళ్ల దళిత బాలికపై జరిగిన అత్యాచారంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యోగీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ “దళిత వ్యతిరేక, మహిళా వ్యతిరేక మనస్తత్వం” కారణంగా రాష్ట్రంలో ఇటువంటి నేరాలు “నిరంతరం జరుగుతున్నాయి” అని రాహుల్ గాంధీ సామాజిక మాథ్యమం Xలో పేర్కొన్నారు.
చెవిటి,మూగ బాలిక మంగళవారం అదృశ్యమైంది. మరుసటి రోజు ఉదయం ఒక పొలంలో నిస్తేజంగా కనిపించింది. ఆమె ప్రైవేట్ భాగాల నుండి రక్తస్రావం అవుతోంది. ఆమె శరీరంపై గాట్లు ఉన్నాయి. బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది, ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.
“ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో 11 ఏళ్ల దళిత బాలికపై జరిగిన దారుణం, క్రూరత్వం చాలా సిగ్గుచేటు, దిగ్భ్రాంతికరం. యుపిలో నిరంతరం జరుగుతున్న ఇటువంటి నేరాలు బిజెపి ప్రభుత్వ హయాంలో దళితులు, ముఖ్యంగా కుమార్తెలకు రక్షణ లేదని స్పష్టంగా రుజువు చేస్తున్నాయి.
“బిజెపి దళిత, మహిళా వ్యతిరేక మనస్తత్వం ఫలితంగా, నేరస్థులకు చట్టమంటే భయం లేదు. బాధితులు నిస్సహాయంగా ఉన్నారు! ఉత్తరప్రదేశ్ కుమార్తెలు ఇంకా ఎంతకాలం ఇలాంటి దారుణానికి గురవుతూనే ఉంటారు?” అని గాంధీ Xలో పోస్ట్‌లో అన్నారు. ప్రభుత్వం తక్షణమే నేరస్థుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి, ఆమె కుటుంబానికి త్వరితగతిన న్యాయం అందించాలని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
ప్రియాంక గాంధీ ప్రతిస్పందన
వయనాడ్ ఎంపి ప్రియాంక గాంధీ వాద్రా కూడా రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించారు. యోగీ పాలనలో మహిళలపై క్రూరత్వం దారుణాలు పెరిగాయని అన్నారు.
“యుపిలోని రాంపూర్‌లో, దళిత వర్గానికి చెందిన బాలికతో అనాగరికంగా ప్రవర్తించారు. ఆ బాలిక మానసికంగా బలహీనంగా ఉంది, ఆమె మాట్లాడదు, వినలేదు. ఆమె మొత్తం శరీరం వికలాంగమైంది. ఇలాంటి దారుణమైన నేరాలు మొత్తం మానవాళిని సిగ్గుపడేలా చేస్తున్నాయని ప్రియాంక అన్నారు.
“ఇదిలా ఉండగా, యూపీలోని కాస్‌గంజ్‌లో ఒక బాలికపై అత్యాచారం చేసినందుకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. నివేదికల ప్రకారం, వారిలో బిజెపి నాయకుడు కూడా ఉన్నాడు. బిజెపి పాలనలో మహిళలపై క్రూరత్వం, దారుణాలకు అంతే లేదు. ఇది ఎప్పుడు ముగుస్తుంది?” అని ఆమె X పోస్ట్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అత్యాచారం సంఘటన జరిగిన 24 గంటల్లోనే ఉత్తరప్రదేశ్ పోలీసులు 24 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. బుధవారం రాత్రి పోలీసులతో జరిపిన కాల్పుల్లో డాన్ సింగ్ గాయపడ్డాడని అధికారులు తెలిపారు.