భువనేశ్వర్ : ఆస్ట్రేలియన్ మిషనరీ గ్రాహం స్టెయిన్స్, అతని ఇద్దరు మైనర్ పిల్లల హత్య కేసు దోషుల్లో ఒకరైన మహేంద్ర హెంబ్రామ్ 25ఏళ్ల జైలు శిక్ష తర్వాత బుధవారం ఒడిశాలోని కియోంఝర్ జైలు నుండి విడుదలయ్యాడు. ఈ నిర్ణయాన్ని విశ్వహిందూ పరిషత్ స్వాగతించింది. హెంబ్రామ్ విడుదలైన తర్వాత, అతని మద్దతుదారులు పూలమాలలతో స్వాగతం పలికి “జై శ్రీ రామ్” నినాదాలు చేశారు.
కాగా, బీజేపీ ప్రభుత్వం సత్ప్రవర్తన కింద అతన్ని జైలు నుంచి విడుదల చేసింది. ప్రస్తుతం 51 ఏళ్ల హెంబ్రామ్ దేశీయంగా, అంతర్జాతీయంగా దిగ్భ్రాంతికి గురిచేసిన భయంకరమైన నేరంలో పాల్గొన్నప్పుడు అతని వయసు 25 ఏళ్లు. 1999 జనవరి 21 రాత్రి, కియోంఝర్ జిల్లాలోని మనోహర్‌పూర్ గ్రామంలో స్టెయిన్స్, అతని కుమారులు ఫిలిప్ (10), తిమోతి (6)లు వారి వాహనంలో నిద్రిస్తుండగా ఒక హిందూ మితవాద గుంపు వారిపై దాడి చేసింది. ఆ గుంపు వాహనాన్ని తగలబెట్టి, ముగ్గురినీ సజీవ దహనం చేసింది. ఈ దారుణ హత్య భారతదేశంలో మత హింసకు చిహ్నంగా మారింది.
కాగా, హెంబ్రామ్‌ను 1999 డిసెంబర్ 9న అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు దారా సింగ్‌ను జనవరి 31, 2000న అరెస్టు చేశారు. 2003లో, CBI కోర్టు సింగ్‌కు మరణశిక్ష విధించింది. హెంబ్రామ్‌తో పాటు 11 మందికి జీవిత ఖైదు విధించింది. అయితే 2005లో ఒరిస్సా హైకోర్టు సింగ్‌కు జీవిత ఖైదును తగ్గించి, 14 మంది నిందితుల్లో 11 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. హెంబ్రామ్ దోషిగా నిర్ధారించింది.
మొత్తం మీద, 1999-2000 మధ్య ఈ కేసులో 51 మందిని అరెస్టు చేశారు. వారిలో, ప్రాథమిక విచారణ సమయంలో 37 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. అప్పీల్ తర్వాత 2008లో ఒక బాల నేరస్థుడిని విడుదల చేశారు.
రాజకీయంగా సున్నితమైన సమయంలో అతని విడుదల జరిగింది. ఇటీవల BJDని ఓడించి ఒడిశాలో తిరిగి అధికారంలోకి వచ్చిన BJP, దారా సింగ్ విడుదల కోసం గతంలో మద్దతు ఇచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి, కియోంఝర్ మాజీ ఎమ్మెల్యే మోహన్ మాఝి సింగ్ విడుదలకు బహిరంగంగా మద్దతు ఇచ్చారు.
మార్చిలో, సుప్రీంకోర్టు ఒడిశా ప్రభుత్వాన్ని దారా సింగ్ ముందస్తు విడుదల కోసం చేసిన అభ్యర్థనను సమీక్షించాలని కోరింది. ఈ విషయం పరిశీలనలో ఉందని, త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒడిశా అంతటా ఇలాంటి సత్ప్రవర్తన కారణాలపై విడుదలైన 31 మంది ఖైదీలలో హెంబ్రామ్ కూడా ఒకడు కావటం గమనార్హం.