సనా : యెమెన్ రాజధాని సనాలో రద్దీగా ఉండే మార్కెట్‌పై అమెరికా తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో మరణించిన వారి సంఖ్య 12 కి పెరిగిందని, కనీసం 30 మంది గాయపడ్డారని హౌతీ నియంత్రణలో ఉన్న ఆరోగ్య అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
హౌతీలు నడుపుతున్న అల్-మసిరా టీవీ ప్రకారం, సనాలోని అత్యంత రద్దీగా ఉండే మార్కెట్లలో ఒకటైన షుబ్ పరిసరాల్లోని ఫర్వా మార్కెట్‌ను వైమానిక దాడులు లక్ష్యంగా చేసుకున్నాయి. శిథిలాల కింద ప్రాణాలతో బయటపడిన వారి కోసం రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయి. ఆదివారం సనాలో, చుట్టుపక్కల అనేక ప్రదేశాల్లో US వైమానిక దాడులకు పాల్పడిందని హౌతీ మీడియా సంస్థను ఉటంకిస్తూ జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
గురువారం రాత్రి పశ్చిమ యెమెన్‌లోని రాస్ ఇసా ఇంధన నౌకాశ్రయంపై అమెరికా వైమానిక దాడుల్లో 80 మంది మృతి చెందగా, 170 మంది గాయపడ్డారు. ఇంధన నిల్వ మౌలిక సదుపాయాలకు విస్తృత నష్టం వాటిల్లింది. దీని ఫలితంగా ఎర్ర సముద్రంలోకి ఇంధనం చిందిందని స్థానిక హౌతీ ఆరోగ్య అధికారులు తెలిపారు.
మార్చి 15న యెమెన్‌లోని హౌతీ లక్ష్యాలపై వాషింగ్టన్ వైమానిక దాడులను తిరిగి ప్రారంభించినప్పటి నుండి…ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్, యుఎస్ యుద్ధనౌకలపై దాడి చేయకుండా హౌతీ గ్రూపును నిరోధించడానికి యుఎస్ మిలిటరీ దాడులకు పాల్పడుతోంది.
ఉత్తర యెమెన్‌లో ఎక్కువ భాగాన్ని నియంత్రించే హౌతీలు, గాజా స్ట్రిప్‌పై దాడిని ఆపడానికి, పాలస్తీనా ఎన్‌క్లేవ్‌లోకి మానవతా సహాయం ప్రవేశించడానికి అనుమతించడానికి అమెరికా మద్దతుగల ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకురావడం తమ దాడుల లక్ష్యం అని చెప్పారు.