న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి లొంగవద్దని చైనా…భారత్ వంటి దేశాలను హెచ్చరించినప్పటికీ, మనదేశం, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలలో “గణనీయమైన పురోగతి” సాధించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ స్వాగతించారు.
న్యూఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో వాన్స్‌తో మోడీ సమావేశమయ్యారు. భారతదేశం నుండి అమెరికా దిగుమతులపై ట్రంప్ విధించిన “పరస్పర సుంకాల”పై న్యూఢిల్లీలో ఆందోళనల మధ్య ఈ సమావేశం జరిగింది. అమెరికా ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా వాన్స్‌తో పాటు ఉన్నారు.
ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికతలు, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టిసారించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ సోమవారం భారత్‌కు వచ్చారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని వారిద్దరూ సమీక్షించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా సమాలోచనలు జరిపారు. దౌత్యం, చర్చలు మాత్రమే సమస్యల పరిష్కారానికి మార్గాలని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది భారత్లో చేపట్టనున్న పర్యటన కోసం తాను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోబాల్ తదితరులు భేటీలో పాల్గొన్నారు. వాన్స్‌తోపాటు పర్యటనకు విచ్చేసిన ఆయన సతీమణి ఉషా చిలుకూరి, మరికొందరు అమెరికా అధికారుల కోసం ప్రదాని ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు. ఢిల్లీలోని తన నివాసంలో వాన్స్ దంపతులతో మోదీ కలియతిరిగారు. ఈ భేటీ వీడియోను ప్రధాని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
కాగా, అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ దంపతులు న్యూఢిల్లీలో దిగిన వెంటనే, భారతదేశ సాంప్రదాయ దుస్తులలో తమ పిల్లలతో అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. వారు నేడు జైపూర్, ఆ తరువాత ఆగ్రాలను సందర్శించి గురువారం అమెరికాకు తిరిగి వెళతారు.