హైదరాబాద్ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారిని ఉగ్రవాదులు చంపినట్లు సమాచారం. ఆయనను బీహార్‌కు చెందిన మనీష్ రంజన్‌గా గుర్తించారు, ఆయన హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO-1)గా నియమితులయ్యారు.
భార్య, పిల్లలతో కలిసి సెలవుల్లో ఆనందంగా గడపటానికి కాశ్మీర్‌కు వెళ్లిన సమయంలో ఆయనను కాల్చి చంపినట్లు సమాచారం. దాడి జరిగిన వెంటనే, ఆయన భార్య, పిల్లలను భద్రతా దళాలు సురక్షితంగా తీసుకెళ్తున్నట్లు కనిపించింది.
ఈ ఉగ్రవాద దాడిలో కనీసం 28 మంది పర్యాటకులు మరణించినట్లు సమాచారం. వారిలో హర్యానాకు చెందిన నావికాదళ అధికారి, కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్ రావు అనే రియల్టర్, మహారాష్ట్రకు చెందిన దిలీప్ డిస్లే, అతుల్ మోన్ అనే ఇద్దరు పర్యాటకులు, ఒడిశాలోని బాలసోర్ జిల్లాకు చెందిన ప్రశాంత్ సత్పతి తదితరులు ఉన్నారు. ఈ ఉగ్రవాద దాడిలో అనేక మంది గాయపడినట్లు సమాచారం.
కాగా, కశ్మీర్‌లో ఉగ్రవాద దాడిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. దాడిని తీవ్రంగా ఖండించారు. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇటువంటి పిరికి దాడులు భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయబోవని ఆయన X లో పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.