న్యూఢిల్లీ : వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాజధానిలోని తల్కటోరా స్టేడియంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) “వక్ఫ్ బచావో సమ్మేళన్” (సేవ్ వక్ఫ్ కాన్ఫరెన్స్) పేరుతో నిన్న పెద్ద ఎత్తున నిరసనను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో AIMPLB మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మానీ, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ముస్లిం సంస్థల ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. సిక్కు, దళిత,ఇతర మైనారిటీ వర్గాల ప్రతినిధులు కూడా పాల్గొని తమ మద్దతును అందించారు.
సభను ఉద్దేశించి ప్రసంగించిన AIMPLB ఉపాధ్యక్షుడు,జమాతే-ఇ-ఇస్లామి హింద్ అధ్యక్షుడు సయ్యద్ సదాతుల్లా హుస్సేనీ, వేదికపై బహుళ మతాల ప్రజలు ఉన్నారని గుర్తు చేశారు, “ఈ చట్టం వెనుక కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం మనల్ని విభజించడమే, కానీ ఆ ఎత్తుగడ హిందువులను, ముస్లింలను దగ్గర చేసింది” అని ఆయన అన్నారు.
వక్ఫ్ సవరణ చట్టం అధికారిక శీర్షిక – UMEED (ఆశ)ను జమాతే-ఇ-ఇస్లామి హింద్ అధ్యక్షుడు విమర్శించారు, దీనిని తప్పుదారి పట్టించేది, వివక్షతతో కూడుకున్నది అని అన్నారు. UMEED అనే సంక్షిప్త పదానికి ఆయన తనదైన శైలిలో భాష్యం చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యాప్తి చేయాలని ఆయన కోరారు.
*U – Unconstitutional – రాజ్యాంగ విరుద్ధం: ఈ చట్టం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25, 26, 29 లను ఉల్లంఘిస్తుంది.
*M – Manipulation– తారుమారు: ఈ చట్టం ప్రజల హక్కులను,వక్ఫ్ భూముల స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం ద్వారా మోసం చేస్తుంది.
*E – Exclusion- మినహాయింపు: ఇది ముస్లింలను అణగదొక్కడానికి, హిందువులు, సిక్కులు వంటి ఇతర మత సమాజాలు అనుభవిస్తున్న హక్కులను హరించడానికి ప్రయత్నిస్తుంది.
*E –Encroachment – ఆక్రమణ: ఇది రాష్ట్రాలు, మైనారిటీల హక్కులను ఉల్లంఘిస్తుంది, వక్ఫ్ ఆస్తులను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.
*D – Division– విభజన: చట్టం ప్రాథమిక లక్ష్యం, దేశాన్ని మతపరంగా విభజించడమని జేఐహెచ్ అధ్యక్షులు అన్నారు.
ఈసందర్భంగా ఖురాన్ నుండి ఓ ఆయత్‌ను సయ్యద్ సాదతుల్లా హుసేనీ ఉటంకించారు – “వారు కుట్రలు పన్నారు, అల్లా కుట్రలు పన్నారు. అల్లా కుట్రదారులలో ఉత్తముడు” అని హుస్సేనీ అన్నారు, ప్రభుత్వం విభజనను సృష్టించాలని ఉద్దేశించినప్పటికీ, చట్టం బదులుగా రాజ్యాంగాన్ని ప్రేమించే పౌరులను మతపరమైన సరిహద్దులకు అతీతంగా ఏకం చేసిందని ఆయన అన్నారు.
ప్రతిపక్ష పార్టీలు, అలాగే హిందూ మిత్రులు పార్లమెంటులో, ఇతర చోట్ల చట్టానికి వ్యతిరేకంగా నిలబడ్డారని ఆయన గుర్తుచేశారు. పౌరులకు మార్గదర్శకత్వం అందిస్తూ ముందుకు సాగడానికి WAQF అనే సంక్షిప్త పదానికి కొత్త అర్థం చెప్పారు.
*W –Wake up– మేల్కొల్పండి: వక్ఫ్ చట్టంపై అవగాహన పెంచుకోండి, మీ ఇళ్ల నుండి బయటకు వచ్చి, ఈ చట్టానికి వ్యతిరేకంగా మీ స్వరాన్ని పెంచండి. మీ పొరుగువారికి, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేయండి. ఈ రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని ఎదుర్కొని మౌనంగా ఉన్నవారిని చరిత్ర క్షమించదు.
*A –Action చర్య: ఈ చట్టాన్ని వ్యతిరేకించడానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా వ్యవహరించాలి. AIMPLB ఆదేశాలను అనుసరించండి, అది ఇమెయిల్‌లు, నిరసనలు, నల్ల బ్యాండ్‌లు ధరించడం ద్వారా అయినా నిరసన తెలపండి.
*Q – Question ప్రశ్న: చట్టసభ్యులు, మీడియా, సవరణ మద్దతుదారులను ప్రశ్నించండి.
*F –Fix the Narrative కథనాన్ని సరిచేయండి: వక్ఫ్ చట్టం గురించి వ్యాప్తి చెందుతున్న తప్పుదారి పట్టించే కథనాన్ని మార్చడానికి కృషి చేయండి.
ఐక్య ప్రయత్నాల ద్వారా ఈ అణచివేత చట్టం చివరికి ఓడిపోవటం ఖాయమని జమాతే-ఇ-ఇస్లామి హింద్ అధ్యక్షుడు తన ప్రసంగాన్ని ముగించారు.
రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా కూడా సమావేశంలో ప్రసంగించారు, భరత భూమిని సరిగ్గా అర్థం చేసుకోలేని వారు ప్రేమ సామరస్యం భాషను అర్థం చేసుకోలేరని అన్నారు. వక్ఫ్ అంశాన్ని ప్రస్తావిస్తూ, తన పార్టీ నాయకులు అర్థరాత్రి వరకు పార్లమెంటరీ కార్యకలాపాలను ఎలా గమనించారో, చట్టాన్ని ఎలా వ్యతిరేకించాలో అని చాలా ఆందోళన చెందారని ఆయన వివరించారు. తన పార్టీ వారితో దృఢంగా నిలుస్తుందని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర ఇలాంటి భావాలను వెల్లడించారు “మేము ఇంతకు ముందు చెప్పాము. ఈ రోజు కూడా పునరుద్ఘాటిస్తున్నాము – పార్లమెంటు నుండి వీధుల వరకు, మీరు మమ్మల్ని ఎక్కడికి పిలిచినా, మేము, మరియు మా పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకించడంలో మీతో నిలుస్తాము” అని అన్నారు.
AIMPLB సభ్యుడు, AIMIM అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ముస్లిం దేశాలలో వక్ఫ్ లేదని బిజెపి సభ్యుడు పార్లమెంటులో చేసిన వాదనకు ప్రతిస్పందిస్తూ…”ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా, అక్కడ వక్ఫ్ ఉందా లేదా అని క్రౌన్ ప్రిన్స్‌ను అడగాలని నేను కోరుకుంటున్నాను” అని అన్నారు. ప్రతి ముస్లిం దేశంలో, అది ప్రజాస్వామ్యం అయినా లేదా రాచరికం అయినా, వక్ఫ్ సంస్థలు ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు.
వక్ఫ్ చట్టం గురించి వాస్తవాలను వక్రీకరించి, ప్రజలను తప్పుదారి పట్టించే బుక్‌లెట్‌ను బిజెపి విడుదల చేసిందని ఒవైసీ ఆరోపించారు. కోర్టులో, వెలుపల చట్టాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. సమావేశంలో ప్రసంగించిన వారిలో ఎస్పీ ఎంపీ మోహిబుల్లా నద్వి, మాజీ కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ అదీబ్, ఏఐఎంపీఎల్‌బీ ప్రధాన కార్యదర్శి ములానా ఫజ్లుర్రహీం ముజాద్దిది, సిక్కు నాయకుడు సర్దార్ దయా సింగ్, క్రైస్తవ నాయకుడు ఏసీ మైఖేల్ ఉన్నారు. ఏఐఎంపీఎల్‌బీ ప్రతినిధి డాక్టర్ ఎస్క్యూఆర్ ఇలియాస్ ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
సామాజిక మాద్యమం Xలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు