న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్ర దాడిలో భద్రతా లోపాలు ఉన్న మాట నిజమేనని అఖిల పక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సమావేశంలో, ఉగ్రవాదంపై చర్య తీసుకోవడంలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రతిపక్ష సభ్యులు హామీ ఇస్తూనే, సమావేశంలో ప్రధాని మోదీ లేకపోవడం, దాడికి దారితీసిన లోపాలు, దాడి తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ద్వేషపూరిత ప్రచారం గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తారని ది వైర్ వార్తాసంస్థ తెలిపింది.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించిన ఈ అఖిలపక్ష సమావేశానికి ప్రభుత్వం వైపు నుండి హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హాజరయ్యారు.
అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరు అయిన ప్రధాని బీహార్‌లోని మధుబనిలో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో తన ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలను ఆయన కొనసాగించారు.
కేంద్ర ప్రభుత్వంలో, బీహార్‌లో బిజెపి కీలక మిత్రపక్షమైన జనతాదళ్ యునైటెడ్ ప్రతినిధులు కూడా ప్రధానమంత్రి తమ రాష్ట్రంలో ఉండటం వల్ల అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేదు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఈ సమావేశంలో లేకపోవడం గమనార్హం, ఈ విషయంలో ప్రభుత్వం ఆ పార్టీకి ఎటువంటి సమాచారం పంపలేదు.
‘భద్రతా లోపం’
సమావేశం తర్వాత, రక్షణ మంత్రి భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) తీసుకున్న చర్యల గురించి నాయకులకు వివరించారని, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), హోం మంత్రిత్వ శాఖ అధికారులు ఇటీవలి సంవత్సరాలలో “అంతా బాగానే జరుగుతున్నప్పటికీ” ఈ సంఘటన జరగడం ఒక “లోపం” అని నాయకులకు చెప్పారని రిజిజు చెప్పారు. “ఉగ్రదాడి చాలా దురదృష్టకరం, ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది” అని సమావేశం తర్వాత ఆయన విలేకరులతో అన్నారు.
“గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారాలు బాగా నడుస్తున్నాయి, పర్యాటకులు వస్తున్నారు; ఈ సంఘటన ఆ వాతావరణాన్ని చెడగొట్టింది. ప్రతి ఒక్కరూ దీని గురించి తమ ఆందోళనలను లేవనెత్తారు. అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావద్దేశం ఐక్యంగా నిలబడాలని స్పష్టం చేశాయి.” “ఎక్కడ లోపాలు జరిగాయో” ఐబీ, హోం మంత్రిత్వ శాఖ అధికారులు కూడా పార్టీ నాయకులకు వివరించారని మంత్రి రిజిజు చెప్పారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వంతో అన్ని పార్టీలు ఉన్నాయని, దేశం మొత్తం ప్రభుత్వంతో ఉందని” ఆయన అన్నారు. ది వైర్ కు అందిన సమాచారం ప్రకారం, ప్రతిపక్ష సభ్యులు భద్రతా లోపాలు, నిఘా వైఫల్యం గురించి ఆందోళనలను లేవనెత్తారు.
సంఘటన జరిగిన ప్రాంతం – పహల్గామ్లోని బైసరన్ లోయ – సాధారణంగా జూన్ నెలలో పర్యాటకుల కోసం తెరిచి ఉంటుందని, పర్యాటకులను అక్కడికి తీసుకెళ్లినప్పుడు స్థానిక అధికారులకు తెలియజేయడం అవసరమని సమావేశంలో పార్టీ నాయకులకు చెప్పినట్లు వర్గాలు తెలిపాయి – అలా చేయలేదు, ఏప్రిల్ 20 నుండి స్థానిక అధికారులకు తెలియజేయకుండానే చిన్న బ్యాచ్‌ల పర్యాటకులను ఈ ప్రాంతానికి పంపారు.
“అయితే ఏప్రిల్ 20న ఎవరికీ తెలియకుండా దీన్ని ఎలా తెరిచారు? ఇదేమైనా జోకా? ఎవరికీ తెలియకుండా 500-1000 మంది అక్కడికి ఎలా చేరుకున్నారు? ఉగ్రవాదులకు ఇది 20వ తేదీన తెరిచారని తెలిస్తే, మన ప్రభుత్వానికి ఎలా తెలియలేదు? వారు దీనికి అస్పష్టమైన సమాధానాలు మాత్రమే ఇచ్చారు.”
“సిఆర్‌పిఎఫ్‌ని క్షేత్రంలో ఎందుకు మోహరించలేదు? జనవరిలో సిఆర్పిఎఫ్ యూనిట్లను ఎందుకు ఉపసంహరించుకున్నారు?” వంటి ప్రశ్నలు సమావేశంలో లేవనెత్తారని ఒవైసీ విలేకరులకు చెప్పారు. అంతేకాదు “క్విక్ రియాక్షన్ టీమ్ అక్కడికి చేరుకోవడానికి గంట సమయం ఎందుకు పట్టిందని ఒవైసీ ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో ద్వేషపూరిత ప్రచారం
ప్రధాన స్రవంతి మీడియా, సోషల్ మీడియాలో, ముఖ్యంగా బిజెపి స్వంత హ్యాండిల్స్ ద్వారా జరుగుతున్న ద్వేషపూరిత ప్రచారం గురించి ఒవైసీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) సుప్రియా సూలే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ హారిస్ బీరాన్ వంటి ప్రతిపక్ష సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేశారని ది వైర్ తెలిపింది.
ప్రధాన మంత్రి లేకపోవడం
సమావేశంలో కనీసం నలుగురు ప్రతిపక్ష సభ్యులు ప్రధానమంత్రి గైర్హాజరీని లేవనెత్తారని ది వైర్‌కు తెలిసింది. సమావేశం తరువాత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, సమావేశానికి ప్రధానమంత్రి హాజరు తప్పనిసరి అని, కానీ ఆయన గైర్హాజరు అయ్యారని అన్నారు.
“మేము ఇంతకుముందు కూడా ఈ ప్రశ్నను లేవనెత్తాము. ఇంత ముఖ్యమైన సమావేశంలో, ప్రధానమంత్రి నిర్ణయం తుది నిర్ణయం కాబట్టి ఆయన హాజరు ముఖ్యం. ‘మేము ఆయనకు ప్రతిదీ తెలియజేస్తాము’ అని వారు చెప్పారు. కానీ వివరించడం వేరు, ప్రధానమంత్రి స్వయంగా వినడం వేరు అని మేము చెప్పాము” అని ఖర్గే అన్నారు.
“ఆయన బీహార్‌లో ఇంగ్లీష్, హిందీలో ప్రసంగాలు ఇస్తున్నారు కానీ ఇక్కడికి రాలేదు” అని ఆప్ నేత సింగ్ అన్నారు. “కానీ ప్రభుత్వం ప్రతిస్పందనగా మేము ఇంతకుముందు ఇలాంటి సమావేశాలకు అధ్యక్షత వహించామని, మీ సమస్యలను అతనికి తెలియజేస్తామని చెప్పింది.” సమావేశం తర్వాత, అన్ని పార్టీ నాయకులు ఒకే గొంతులో మాట్లాడటం చూశామని రిజిజు అన్నారు.
సమావేశం సానుకూలంగా ముగిసింది. ఉగ్రవాదాన్ని ఐక్యంగా ఎదుర్కోవడానికి ఈ సమావేశంలో మనం స్వీకరించిన స్ఫూర్తి చాలా ముఖ్యమైనదని నేను నమ్ముతున్నాను. మనం రాజకీయాలు చేయకూడదని మరియు దేశం ఐక్యంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేసాము. ఈ సందేశాన్ని కూడా అందరూ ఇచ్చారు. ఈ సంఘటనకు పాకిస్తాన్ మరియు దాని సానుభూతిపరులపై ఐక్యంగా ప్రతీకారం తీర్చుకుంటాము” అని ఆయన అన్నారు.
ఈ సమావేశానికి ఖర్గే, సింగ్, ఒవైసీ, సూలేతో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రఫుల్ పటేల్ (ఎన్‌సిపి), సస్మిత్ పాత్ర (బిజూ జనతాదళ్), లావు శ్రీకృష్ణ దేవరాయలు (తెలుగుదేశం పార్టీ), శ్రీకాంత్ షిండే (శివసేన), సుదీప్ బందోపాధ్యాయ (తృణమూల్ కాంగ్రెస్), తిరుచి శివ (ద్రావిడ మున్నేట్ర కజగం), రామ్ గోపాల్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ), బికాష్ రంజన్ భట్టాచార్జీ (CPI (M)) ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు.