ఇంఫాల్ : బుధవారం సాయంత్రం, మణిపూర్‌లోని కామ్జోంగ్, సహంఫుంగ్‌లోని రెండు గ్రామాల్లోని కుకి ఇళ్లకు దుండగులు నిప్పంటించి, వాటిని ధ్వంసం చేశారు. 28 ఇళ్లు కాలి బూడిదయ్యాయని అంచనా. ఈ ఘటన తరువాత జిల్లా మేజిస్ట్రేట్ రెండు గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని పోలీసు అధికారులు తెలిపారు. అయితే, ఈ దాడి కారణంగా ఇళ్ళు, జీవనోపాధిని కోల్పోవడంతో అనేక కుకీల కుటుంబాలు నాశనమయ్యాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సహంఫంగ్ సబ్ డివిజన్ పరిధిలోని గంపల్, హైయాంగ్ గ్రామాలలో ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ సంఘటనలు జరిగాయి. ధ్వంసమైన గ్రామాలు భారతదేశం-మయన్మార్ సరిహద్దుకు సమీపంలో, కామ్జోంగ్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
ఈ సంఘటన తర్వాత డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కర్ఫ్యూ ఉత్తర్వు జారీ చేశారు. “ఇటువంటి, చర్యలు శాంతికి భంగం కలిగించవచ్చు. ప్రజా ప్రశాంతతకు ముప్పు కలిగించవచ్చు, తద్వారా మానవ ప్రాణాలకు, ఆస్తికి ప్రమాదం ఏర్పడుతుంది” అని ఉత్తర్వులో పేర్కొంది. కర్ఫ్యూ కారణంగా, ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వెళ్లడం నిషేధించారు.
కుకి ఇన్ఫీ మణిపూర్, కుకి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఈ దాడిని ఖండించాయి. రెండు గ్రామాల పునర్నిర్మాణం ద్వారా కుటుంబాలకు తక్షణ న్యాయం చేయాలని, అలాగే సరైన పునరావాసం, ప్రాథమిక అవసరాలను అందించాలని డిమాండ్ చేశాయి. “ఈ దారుణమైన దాడులు అమాయక పౌరులను భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే సున్నితంగా ఉన్న శాంతి, స్థిరత్వానికి మరోసారి ముప్పు కలిగిస్తున్నాయి” అని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
కుకి-జో కమ్యూనిటీకి చెందిన అనేక ఇతర సంస్థలు కూడా ఈ దాడిని ఖండించాయి. న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. అధికారులు నిజాయితీ న్యాయంగా వ్యవహరించాలని కోరారు. గ్రామస్తుల భద్రతను నిమిత్తం, గొడవలు మరింత తీవ్రతరం కాకుండా నిరోధించడానికి భద్రతా దళాలను మోహరించాలని కూడా సంస్థలు డిమాండ్ చేశాయి.