మహారాష్ట్ర : వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పర్భానీలో జరిగిన ఒక కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నిరసన సభను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈద్గా మైదాన్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న వ్యక్తులు ప్రభుత్వం ‘రాజ్యాంగ విరుద్ధమైన’ చర్య తీసుకున్నందుకు విమర్శించారు. బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమ ప్రసంగంలో, వక్తలు పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించారు బాధితులకు, వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.
భారీ జనసమూహాన్ని ఉద్దేశించి అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, “బిల్లు ఉపసంహరించుకోవాలని నేను మోడీని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ఇది ఒక నల్ల చట్టం అని, దీని వల్ల మోడీ మాత్రమే ప్రయోజనం పొందుతారని నేను పార్లమెంటులో చెప్పాను. ఈ చట్టం మన ఆస్తిని లాక్కుంటుందని అన్నారు.”
వక్ఫ్ పూర్తిగా అల్లాహ్ కు చెందుతుందని ఒవైసీ నొక్కిచెప్పారు. ఈ బిల్లు వెనుక ఉన్న ఉద్దేశ్యాలు ఏమిటని బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మసీదులు, శ్మశానాలు, ఇతర వక్ఫ్ ఆస్తులను లాక్కోవడానికి బిజెపి ప్రణాళికలు వేస్తోందని ఆరోపిస్తూ, వక్ఫ్ బిల్లు పేద ముస్లింలకు ప్రయోజనం చేకూరుస్తుందనే వాదనలన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో అసదుద్దీన్ ఒవైసీ, బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మాని, జనరల్ సెక్రటరీ ఫజ్లూర్ రహీమ్ ముజాద్దిది, SDPI ఉపాధ్యక్షుడు ముహమ్మద్ షఫీ, సదాతుల్లా హుస్సేని, ఇతరులు సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.