గాజా, సనా : పశ్చిమాసియా వైమానిక దాడులతో తల్లడిల్లుతోంది. ఉత్తర సాదాలో ఆఫ్రికన్ వలసదారులను ఉంచిన జైలుపై అమెరికా దళాలు బాంబులతో దాడి చేశాయని, కనీసం 68 మంది మరణించారని, 47 మంది గాయపడ్డారని హౌతీ అనుబంధ మీడియా తెలిపింది. ఈ జైలులో 115 మంది ఖైదీలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. యెమెన్ రాజధాని సనాలో కూడా అమెరికా… వైమానిక దాడులు జరిపిందని, ఈ దాడుల్లో ఎనిమిది మంది మరణించారని హౌతీలు తెలిపారు.
ఈ కారాగారంలో బందీలంతా ఇథియోపియా తదితర ఆఫ్రికా దేశాల నుంచి సౌదీ అరేబియాకు అక్రమంగా వలసవెళ్తూ పట్టుబడిన వారు. “ఆపరేషన్ రఫ్ రైడర్” పేరుతో హూతీలను లక్ష్యంగా చేసుకొని అమెరికా జరుపుతున్న దాడుల తీరుపై తాజా పరిణామం ప్రశ్నలు లేవనెత్తింది. కాగా, దాడులకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని అమెరికా బహిరంగంగా వెల్లడించడం లేదు. గోప్యతను కాపాడుకునేందుకు ఉద్దేశ పూర్వకంగానే అలా చేస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది
ఇదిలా ఉండగా… ఇజ్రాయెల్ దళాలు తెల్లవారుజామున గాజాపై జరిపిన దాడుల్లో 23 మంది పాలస్తీనియన్లను చనిపోయారని అక్కడి వైద్యులు తెలిపారు, గాజా స్ట్రిప్ అంతటా కనీసం 53 మంది మరణించిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం.
గత నెలలో హమాస్‌తో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ దాదాపు ప్రతిరోజూ దాడులు చేస్తూనే ఉంది. సుమారు 20 లక్షల జనాభా కలిగిన గాజ ప్రాంతానికి ఆహారం, ఔషధాలతో సహా ఏ విధమైన సహాయమూ అందకుండా ఇజ్రాయెల్ గత మార్చి నుంచి దిగ్బంధించింది. గాజాలో కరువు హెచ్చరికల మధ్య అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ మానవతా బాధ్యతలపై విచారణలను ప్రారంభించనుంది.
18 నెలల క్రితం గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కనీసం 52,243 మంది పాలస్తీనియన్లు మరణించారని, 117,639 మంది గాయపడ్డారని నిర్ధారించారు. గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం మరణాల సంఖ్యను 61,700 మందికి పైగా అప్‌డేట్ చేసింది, శిథిలాల కింద తప్పిపోయిన వేలాది మంది మరణించినట్లు భావిస్తున్నారు.
2023 అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలో జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,139 మంది మరణించారని, 200 మందికి పైగా బందీలుగా పట్టుబడ్డారని అంచనా.