హైదరాబాద్ : మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తోంది. ఇక్కడి కళలు, సంస్కృతి, వారసత్వ సంపదను విదేశీ అతిథులకు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈమేరకు మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల్లో భాగంగా వచ్చే సుందరీమణులు, ప్రతినిధుల కోసం చారిత్రాత్మక చార్మినార్, లాడ్ బజార్ మార్కెట్‌లో హెరిటేజ్ వాక్ చేయనున్నారు. దీంతో పనులు ఎంతవరకు వచ్చాయంటూ GHMC కమిషనర్ R V కర్ణన్ వివిధ విభాగాల అధికారులతో కలిసి చార్మినార్‌తో పాటు అక్కడి పరిసరాలను సందర్శించారు. సంబంధిత పనులన్నింటినీ వేగవంతం చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. మిస్‌వరల్డ్ పోటీదారులు ఎలాంటి అసౌకర్యానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
హెరిటేజ్ టూర్ నిర్వహణకు సంబంధించిన శాఖల వారీగా పనులు, ఏర్పాట్లను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్ దగ్గర పెండింగ్‌లో ఉన్న సుందరీకరణ పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
షెడ్యూల్ ప్రకారం, మిస్ వరల్డ్ పోటీదారులు చార్మినార్, లాడ్ బజార్‌లలో హెరిటేజ్ వాక్‌కు వెళతారు, తరువాత మే 13న చౌమహల్లా ప్యాలెస్‌లో విందు చేస్తారు. ఇదిలా ఉంటే, కొత్తగా నియమితులైన కమిషనర్ బుధవారం ఓల్డ్ సిటీలో వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అరామ్‌గఢ్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కర్ణన్ అధికారులను ఆదేశించారు. అరామ్‌గఢ్ నుండి జూ పార్క్ వరకు ఫ్లైఓవర్, శాస్త్రిపురం ROB పనులను ఆయన పరిశీలించారు.