హైదరాబాద్ : వందల కోట్లు ఖర్చు చేసి, మూడు నెలల క్రితం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్.. చిన్నపాటి ఈదురు గాలులతో కూడిన వర్షానికే ధ్వంసం అయ్యింది. దక్షిణ భాగం వైపు కొత్తగా నిర్మించిన ప్రధాన ముఖద్వారం వద్ద రూఫింగ్ షీట్లు కింద పడిపోయాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల ప్రధాన ముఖ ద్వారం పైకప్పు భాగాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రైల్వే పోలీసులు, స్టేషన్ సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
మే 3వ తేదీ శనివారం కేవలం 2.5 సెం.మీ. వర్షపాతం, గంటకు 15 కి.మీ. వేగంతో వీచిన గాలుల తర్వాత నీటి లీకేజీలు పైకప్పు ప్యానెల్‌లు కూలిపోయాయి. నివేదికల ప్రకారం, గాలులు, వర్షం ఆ ప్రాంతంలో వీచినప్పుడు ప్రధాన గేటు పైకప్పుపై ఉన్న ఇనుప షీట్లు విరిగిపోయాయి.
కాగా, కేంద్రప్రభుత్వం అమృత్ పథకంలో భాగంగా చర్లపల్లి సహా పలు రైల్వే స్టేషన్లను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. ముఖ్యంగా సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల మీద ఉన్న ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు చర్లపల్లిలో అత్యాధునిక రైల్వే టెర్మినల్ ను నిర్మించారు. పెరుగుతున్న ట్రాఫిక్ ను తగ్గించడంతో పాటు ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి అనుగుణంగా నగర శివార్లలో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. వందల కోట్ల వ్యయంతో విమానాశ్రయాన్ని తలపించేలా ఈ రైల్వే టెర్మినల్ ను తీర్చిదిద్దారు.
మొత్తం రెండు అంతస్తులలో ఈ శాటిలైట్ టెర్మినల్ ను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ లో మొత్తం 9 ఫ్లాట్ ఫారమ్ లను నిర్మించారు. 19 రైల్వే లైన్లను ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా 5 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు నిర్మించారు. ప్రయాణీకులకు అనుకూలంగా గ్రౌండ్ ఫ్లోర్ లో 6 టికెట్ బుకింగ్ కౌంటర్లు, స్త్రీ, పురుషులకు వేర్వేరుగా వెయిటింగ్ హాల్స్, ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో కేఫ్టీరియా, రెస్టారెంట్, స్త్రీలు, పురుషుల కోసం విశ్రాంతి గదులు నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ లో ప్రయాణీకులకు ఉచితంగా వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
సుమారు రూ.430 కోట్ల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ చిన్న గాలివానకే విధ్వంసానికి గురికావడం పట్ల ప్రతి ఒక్కరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హంగూ ఆర్బాటం తప్ప పనుల్లో క్వాలిటీ లేవని విమర్శలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా… ధ్వంసమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పరిశీలించారు. అనంతరం జీఎం అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. సీలింగ్ ధ్వంసం అయిన చోట తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతేగాక ప్రయాణికుల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక స్టేషన్ లో దెబ్బతిన్న అన్ని ప్రాంతాలను స్పష్టంగా పర్యవేక్షించి మరమ్మతులు చేపట్టాలని అధికారులకు చెప్పారు.