ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి ఫలితంగా కుల గణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది తెలంగాణ ప్రజల విజయం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈమేరకు వివిధ BC కుల సంస్థల నాయకుల సమావేశంలో ప్రసంగిస్తూ…తెలంగాణలో కులగణన చేసి దేశానికి రోల్ మోడల్‌గా నిలిచామని అన్నారు. ప్రభుత్వం నిర్ణయాల్లో కులగణనను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. కులగణన సర్వే ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు.
అదేవిధంగా ప్రభుత్వానికి బీసీలు ఎల్లప్పడూ అండగా ఉండాలని కోరారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సామాజిక అసమానతలు తొలగించడానికి దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కులగణన ఆధారంగా బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపామని అన్నారు. కులగణన చేపట్టాలనే రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నా.. పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రజల ఒత్తిడికి తలొగ్గి అందుకు ఒప్పుకుందని తెలిపారు. రాష్ట్రంలో తాము నిర్వహించిన కులగణనను ఇన్నాళ్లు అపహాస్యం చేసిన బీజేపీ ఇప్పుడు తమ దారిలోకి రావడం సంతోషకర పరిణామమని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
తెలంగాణలో నిర్వహించిన మాదిరిగానే దేశవ్యాప్తంగా కుల గణనను డిమాండ్ చేస్తూ గుజరాత్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించామని కూడా ఆయన ప్రస్తావించారు. అంతేకాదు రాష్ట్రం, దేశవ్యాప్తంగా కుల గణనను విస్తరించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రధానమంత్రికి ఒక లేఖ పంపింది, ఇది కేంద్రంపై ఒత్తిడిని తీవ్రతరం చేసింది.
మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలోని CWC కూడా తెలంగాణలో మాదిరిగానే దేశవ్యాప్తంగా కుల గణనను నిర్వహించాలని నిర్ణయించిందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటులో కుల గణనకు బలమైన మద్దతు ప్రకటించారు. దీని తరువాత పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తారు, చివరికి కేంద్రం జాతీయ కుల గణనకు అంగీకరించవలసి వచ్చిందని భట్టి విక్రమార్క అన్నారు.
42% BC రిజర్వేషన్ల అమలు ప్రజా ప్రభుత్వం కింద మాత్రమే సాధ్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం మంత్రివర్గంతో కలిసి ఈ లక్ష్యం కోసం నిజాయితీగా పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోతగాని వెంకన్న, గౌడ్, యాదవ్, నాయి బ్రాహ్మణ, రజక, పద్మశాలి, విశ్వకర్మ, శాలివాహన, కాపు వంటి వివిధ BC వర్గాల నాయకులు పాల్గొన్నారు.