హైదరాబాద్ : దుబాయ్ పోలీసులు మే 13 నుంచి 15 వరకు నిర్వహించనున్న వరల్డ్ పోలీస్ సమ్మిట్ (డబ్ల్యూపీఎస్) 2025లో ‘ఎక్స్‌లెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు’ విభాగంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ , హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్‌ఎన్‌యూ)కు ప్రథమ స్థానం లభించింది. ఈ మేరకు సీపీ ఆనంద్ ఈ అవార్డును మే 15న అందుకోనున్నారు
ఈ సమ్మిట్ 138 దేశాల నుండి ప్రముఖ చట్ట అమలు నిపుణులను ఒకచోట చేర్చే ఒక ప్రధాన ప్రపంచ వేదిక. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI), న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (NYPD), లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (LAPD), మెట్రోపాలిటన్ పోలీస్ (UK), ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్, జర్మన్ పోలీసులు వంటి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఏజెన్సీల భాగస్వామ్యంతో వారి వ్యూహాత్మక సహకారాన్ని, వారి ఉత్తమ పద్దతులను అందిపుచ్చుకోవాడానికి తోడ్పడుతుంది. అంతేకాదు ఆధునిక పోలీసింగ్ సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన పద్ధతులు, ఆలోచనలు ఈ ప్రపంచ పోలీస్ సమ్మిట్ అందిస్తుంది.
కాగా, ఈ సంవత్సరం అవార్డు నామినేషన్లలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పోటీ నెలకొంది. మిగతా ఖండాల్లోని వివిధ రకాల పోలీసు విభాగాల నుండి వచ్చిన ఎంట్రీలను… నైపుణ్యం కలిగిన నిపుణులు, దుబాయ్ పోలీసులతో కూడిన జ్యూరీ రెండు దశల్లో క్షుణ్ణంగా పరిశీలించింది.
ఇందులో భాగంగా మాదకద్రవ్యాల వ్యతిరేక సరఫరాపై ప్రభావం, మాదకద్రవ్యాల వినియోగంలో క్షీణత, సమాజ పాత్ర, పరస్పర సహకారం మొదలైనవి ఉన్నాయి. మొదటి దశలో, ప్రతి న్యాయమూర్తి ఎంట్రీలను సమీక్షించి స్కోర్ వేసారు. ప్రతి వర్గంలోని మొదటి ఐదు ఎంట్రీలను షార్ట్‌లిస్ట్ చేశారు.
రెండవ దశలో, షార్ట్‌లిస్ట్ చేసిన ఎంట్రీలను సంప్రదించి, వారి చొరవలు మరియు అమలు చర్యలను ధృవీకరించడానికి వర్చువల్ సమావేశంలో పాల్గొనమని ఆహ్వానించారు. ఈ వర్చువల్ సమావేశంలో, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సమగ్రంగా అమలు చర్యలను వివరించారు.
మాదాకద్రవ్యలను అరికట్టడంలో ఈ డి, ఎన్ సీఆర్ బీ, డి ఆర్ ఐ, ఎక్స్ సైజ్, ఎఫ్ ఆర్ ఆర్ ఓ, డ్రగ్స్ కంట్రోల్ విభాగంతో సమన్వయంతో చేస్తున్న చర్యలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్ లైన్‌లో వివరించారు. మత్తుకు బానిసలైన వారిని మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను తెలిపారు. అవగహన కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరిస్తు కనపడుతున్న ఫలితాలను ముందుపెట్టారు. వీటన్నింటిని పరిశీలించిన వరల్డ్ పోలీస్ సమ్మిట్ ప్రతినిధులు హైదరాబాద్ హెచ్ -న్యూ ను, సీపీ సీవీ ఆనంద్‌ను ఎక్స్ లెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డుకు ఎంపిక చేసారు.
కాగా, హైదరాబాద్ పోలీసులకు, సీపీ ఆనంద్‌కు ఈ అవార్డు దక్కడం దేశంలోని సామూహిక మాదక ద్రవ్యాల నిరోధక ప్రయత్నాలకు కూడా ఒక గొప్ప విజయం.