హైదరాబాద్ : గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేత కార్యకలాపాలను చేపట్టింది. సంధ్య కన్వెన్షన్ ప్రాంతంలోని ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. లేఅవుట్‌లోని రోడ్లు, పార్కులలో ఆక్రమణలతో సహా అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలను అధికారులు గుర్తించి కూల్చివేశారు.
అధికారిక లేఅవుట్‌లో భాగం కాని ప్లాట్‌లపై అనధికార నిర్మాణంపై ప్లాట్ యజమానులు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగింది. కూల్చివేతలో భాగంగా, వంటగది, రెస్ట్‌రూమ్‌లతో సహా సంధ్య కన్వెన్షన్ మినీ హాల్‌ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అదనంగా, లేఅవుట్‌పై అక్రమంగా నిర్మించిన రీడ్ ఫెన్సింగ్‌ను కూడా తొలగించారు.
గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 124, 127లలోని దాదాపు 20 ఎకరాల భూమిలో గతంలో ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) లేఅవుట్ వేసింది. ఈ లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన 162 మంది.. తమ సొసైటీ లేఅవుట్‌లో సంధ్యా కన్వెన్షన్ యజమానులు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. గతంలో వేసిన లేఅవుట్‌ను మార్చి, రోడ్లు, పార్కులను ఆక్రమిస్తూ సంధ్యా కన్‌స్ట్రక్షన్ అనేక అక్రమ కట్టడాలు చేపట్టిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు… ఉదయం నుంచి అనుమతులు లేని నిర్మాణాలను తొలగించే పనిని ప్రారంభించింది.