న్యూఢిల్లీ : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ, భద్రతా దళాల కదిలికలకు సంబంధించిన ఎటువంటి లైవ్ ప్రసారం చేయకూడదని ఆయా మీడీయా సంస్థలకు భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. వార్తా సంస్థలు, డిజిటల్ ప్లాట్ ఫాంలు, టీవీ నెట్ వర్క్ లు, సోషల్ మీడియా వినియోగదారులు అందరికి ఈ హెచ్చరికలు వర్తిస్తాయని తెలిపింది.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సూచనల ప్రకారం, కవరేజీని నిలిపివేయాలని ఆయా మీడియా సంస్థలను ఆదేశించింది. రక్షణ, భద్రతా దళాల సమాచారం బహిర్గతం అయితే ప్రత్యర్థులకు సాయపడుతుంది. భద్రతా సిబ్బందికి హాని కలిగేఅవకాశం ఉందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కార్గిల్ యుద్ధం, 26/11, కాందహార్ హైజాక్ వంటి గత సంఘటనలు ప్రసారం చేయడం ద్వారా చాలా నష్టం జరిగింది. కాబట్టి అన్ని మీడియా ఛానెళ్లు మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు పాటించాలని కోరింది.
ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు పూర్తయిన తర్వాత అధికారిక బ్రీఫింగ్‌ల ద్వారా మాత్రమే మీడియా ఇప్పుడు కార్యకలాపాలను ప్రసారం చేయాలని ప్రభుత్వం తెలిపింది. “ఏ కార్యక్రమం కూడా ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాన్ని చూపించకూడదు. ప్రభుత్వ అధికారి నుండి వచ్చే సమాచారం కోసం మీడియా వేచి ఉండాలని పేర్కొంది.”
ఈ నియమాలు, హెచ్చరికలను ఉల్లంఘించే ప్లాట్‌ఫారమ్‌లపై కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ రూల్స్ 2021 ప్రకారం తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సమాచార ,ప్రసార మంత్రిత్వ శాఖ ఇప్పటికే అన్ని టీవీ ఛానెళ్లకు సూచనలు జారీ చేసింది. ఉల్లంఘిస్తే చర్యలు చేపడతామని హెచ్చరించింది.
ఈ విషయంలో అన్ని వర్గాలు అప్రమత్తత, సున్నితత్వం, బాధ్యతతో వ్యవహరించాలని, దేశ సేవలో అత్యున్నత ప్రమాణాలను పాటించాలని విజ్ఞప్తి చేసింది.