టెల్ అవీవ్ : ఏడాదిన్నరగా కొనసాగుతున్న యుద్ధం వల్ల గాజాలో మరణాల సంఖ్య 53 వేలకు చేరువైంది. 2023 అక్టోబర్ నుండి గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న జాతి విధ్వంస యుద్ధంలో కనీసం 52,810 మంది పాలస్తీనియన్లు మరణించారని స్ట్రిప్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
గత 24 గంటల్లో ఎన్‌క్లేవ్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో 23 మంది మరణించగా, మరో 124 మంది గాయపడ్డారని, ఇజ్రాయెల్ దాడిలో గాయపడిన వారి సంఖ్య 119,473 కు చేరుకుందని మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. “చాలా మంది బాధితులు ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్నారు, రెస్క్యూ సిబ్బంది వారిని చేరుకోలేకపోతున్నారు” అని ఆ ప్రకటన తెలిపింది.
మార్చి 18న ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌పై తన దాడులను తిరిగి ప్రారంభించింది. అప్పటి నుండి 2,701 మందిని చంపి 7,432 మందిని గాయపరిచింది, జనవరిలో ప్రారంభమైన కాల్పుల విరమణ ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని విచ్ఛిన్నం చేసింది.
గత నవంబర్‌లో, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఆయన మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌లపై గాజాలో యుద్ధ నేరాలు, మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
ఇజ్రాయెల్ కూడా గాజా ఎన్‌క్లేవ్‌పై యుద్ధం చేసినందుకు అంతర్జాతీయ న్యాయస్థానంలో జాతి నిర్మూలన కేసును ఎదుర్కొంటోంది.