న్యూఢిల్లీ : భారత సైన్యాధికారి కల్నల్ సోఫియా ఖురేషి గురించి మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇండోర్‌లోని అంబేద్కర్ నగర్ (మోవ్)లోని రాయుకుండా గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ… ‘వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణులు, ఆడకూతుళ్ల సిందూరం తుడిచేసి పారిపోయారు. వారి సొంత సోదరినే వాళ్లకు గట్టి సమాధానం చెప్పమని మనం పంపాం” అని మంత్రి విజయ్ షా వివాదాస్పద ప్రకటన చేశారు.
ఇటీవలి భారత సైనిక మిషన్ “ఆపరేషన్ సిందూర్” గురించి ప్రస్తావించిన ఆయన వ్యాఖ్యలకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. కాగా, మంత్రి అభ్యంతర వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. కల్నల్ సోఫియా ఖురేషిని టెర్రరిస్టుల సోదరిగా ఆయన సంబోధించడం ఏమిటని నిలదీసింది. సోఫియా ఖురేషిని చూసి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడని, అయినా కొందరు ఆమె గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని పేర్కొంది. ఇది మన వీరజవాన్లను అమానించడమేనని ఆక్షేపించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సన్నిహితుడుగా చెప్పుకునే విజయ్ షాను తక్షణం రాజీనామా చేయాల్సిందిగా బీజేపీ కోరాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ మంత్రి షా వ్యాఖ్యలను ఖండించారు. వివాదంపై బిజెపి తన వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. మంత్రి ప్రసంగం వీడియోను పట్వారీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, జవాబుదారీతనం కోసం పిలుపునిచ్చారు. సైనిక నిర్ణయాలను మతపరమైన, లింగ ఆధారిత కథనంలో రూపొందించిన మంత్రి షా ప్రకటన ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తుందని ఆయన వాదించారు.పాలన ముసుగులో ప్రతీకార చర్యలను సమర్థించడానికి రాజకీయ వాక్చాతుర్యాన్ని ఉపయోగించడం గురించి మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలు ఆందోళనలను రేకెత్తించాయని పట్వారీ అన్నారు.
కాగా, ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో సోషిపా ఖురేషి అందరి దృష్టిలో పడ్డారు. 1999లో ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్‌లో చేరి క్రమంగా 2016లో మల్టీనేషనల్ మిలటరీ విన్యాసాలకు సారథ్యం వహించిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
మరోవంక విజయ్ షా వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2013 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఝబువాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అప్పటి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భార్య సాధనా సింగ్ గురించి అనుచిత వ్యాఖ్య చేశారు. వివాదం తీవ్రమైంది, ఆ సమయంలో మంత్రి షా రాజీనామాకు దారితీసింది.
నవంబర్ 2023లో, సినిమా షూటింగ్ కోసం బాలాఘాట్‌లో ఉన్న నటి విద్యాబాలన్‌ను కలవాలనే కోరికను మంత్రి షా వ్యక్తం చేశారు. ఆమె తనను కలవడానికి నిరాకరించిన తర్వాత, మంత్రి షా అటవీ శాఖకు ఆమె నష్టం కలిగించారని ఆరోపించారు. ఈ సంఘటన జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా మంత్రి, రాష్ట్ర అటవీ శాఖ తమ చర్యలను ఉపసంహరించుకోవలసి వచ్చింది.
మంత్రి అభ్యంతర వ్యాఖ్యల వీడియో లింక్