హైదరాబాద్ : రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు భారీగా పెరగనున్నాయి. అనేక విద్యా సంస్థలు 100 శాతం పెంపును డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పెంపు భారం తప్పకపోవచ్చు.
ఈమేరకు ఆయా ఇంజనీరింగ్ సంస్థల యాజమాన్యాలు ఫీజు పెంపు కోసం తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (TAFRC)కి ప్రతిపాదనలు సమర్పించాయి. 2025-26 విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యే రాబోయే మూడేళ్ల బ్లాక్ పీరియడ్‌కు 50 శాతం నుండి 100 శాతం వరకు పెంపును ఆయా యాజమాన్యాలు కోరుతున్నాయి.
DCలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం… CBIT వార్షిక రుసుమును రూ.1.65 లక్షల నుండి రూ.2.45 లక్షలకు, MGITకి రూ.1.60 లక్షల నుండి రూ.2.45 లక్షలకు, గీతాంజలి రూ.1.20 లక్షల నుండి రూ.1.55 లక్షలకు పెంచాలని సిఫార్సు చేసింది.
ఈ కళాశాలలతో పాటు, గోకరాజు రంగరాజుకు రూ.1.30 లక్షల నుండి రూ.1.80 లక్షలకు, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతికి రూ.1.35 లక్షల నుండి రూ.2.20 లక్షలకు, వాసవికి రూ.1.40 లక్షల నుండి రూ.2.15 లక్షలకు ఫీజు పెంపును ప్రతిపాదించారు. ఇతర కళాశాలలకు, 35-65 శాతం వరకు పెంపును సిఫార్సు చేసింది.
తుది నిర్ణయం సిఎందే!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా శాఖను నిర్వహిస్తున్నందున, హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు పెంపుపై తుది నిర్ణయం సీఎం తీసుకుంటారు. జూన్ మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్న టిజి ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌కు ముందు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఫీజు పెంచితే, తల్లిదండ్రులపై ఆర్థికంగా భారం పడటమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన నిధులు కూడా పెరుగుతాయి. భారీ ఫీజుల పెంపు జరగకపోయినా, ముఖ్యంగా హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలకు కొంతమేర ఫీజుల పెంపు ఉండవచ్చు.